Tirupati Special Trains : తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడపనుంది. వేసవి సెలవుల కావడంతో తిరుమలలో రద్దీ పెరుగుతోంది. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇవాళ్టి(మే 31) నుంచి హైదరాబాద్- తిరుపతి, తిరుపతి- హైదరాబాద్, తిరుపతి- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- తిరుపతి మధ్య ఈ స్పెషల్ ట్రైన్లు నడపనున్నారు. తిరుపతి-హైదరాబాద్ మధ్య మొత్తం 10 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు పేర్కొంది.
ఆగే స్టేషన్లు
సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్ లలో ప్రత్యేక రైళ్లు ఆగనున్నాయి. తిరుపతి- కాకినాడ టౌన్ మధ్య 10 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇవి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ లలో ఆగనున్నాయని పేర్కొంది. కాచిగూడ-తిరుపతి మధ్య రెండు వేసవి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది. ఈ ప్రత్యేక రైలు జూన్ 1, 2వ తేదీలు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట రైల్వేస్టేషన్ లలో ఆగనున్నాయి.
విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లు
విశాఖ- సికింద్రాబాద్, విశాఖ- మహబూబ్‌నగర్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ నడుపనుంది. ప్రయాణికులు రద్దీ దృష్ట్యా జూన్ 1 నుంచి జూన్ 29 వరకు వారాంతపు రైళ్లు నడపనుంది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య ట్రైన్ నెంబర్ 08579/08580 జూన్ 1న రాత్రి 7 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరునుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం సికింద్రాబాద్‌లో రాత్రి 7.40 గంటలకు బయలుదేరి విశాఖకు మరుసటి ఉదయం 6.40 గంటలకు చేరుకుంటుంది. విశాఖ-మహబూబ్‌నగర్ రైలు నెంబర్ 08585/08586 జూన్ నెల 7 నుంచి 29 వరకు నడవనుంది. ప్రతి మంగళవారం విశాఖలో రాత్రి 7 గంటలకు బయలుదేరి, మరుసటి ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకోనుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకు మహబూబ్‌నగర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖ చేరుకోనుంది.