SCR Announced Additional Coaches To Visakha Secunderabad Vandebharat: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే శబరిమల వెళ్లే భక్తుల కోసం 62 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయగా.. తిరుపతి (Tirupati) వెళ్లే వారి కోసం రెండు వీక్లీ స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయనుంది. హిసార్ - తిరుపతి వీక్లీ స్పెషల్ (రైలు నెం. 04717) డిసెంబర్ 7 నుంచి 17 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి శనివారం హిసార్‌లో బయలుదేరి మరుసటి రోజు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి - హిసార్ వీక్లీ స్పెషల్ (నెం. 04718) డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ వరకూ నడుస్తుంది. ఈ రైలు ప్రతీ సోమవారం తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు హిసార్ చేరుకుంటుంది. ఈ 2 రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.


వందే భారత్‌కు అదనపు కోచ్‌లు


అలాగే, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే (20707) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ రైలు 8 కోచ్‌లతో నడుస్తుండగా.. మరో 8 బోగీలు జత చేయనున్నారు. అటు, సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే మరో వందేభారత్ రైలు (20833) ప్రస్తుతం 16 బోగీలతో నడుస్తుండగా.. దీనికి మరో 4 బోగీలు జత చేయనున్నారు. మరోవైపు, విశాఖ - కిరండూల్ ప్యాసింజర్ స్పెషల్ (08551) డిసెంబర్ 1 నుంచి 31 వరకూ ఒక స్లీపర్ క్లాస్ పెంచనున్నారు. డిసెంబర్ 6, 8, 10, 12, 14, 16, 18, 20. 22, 24, 26, 28, 30, జనవరి 1 తేదీల్లో ఒక థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌ను జత చేయనున్నారు.


అటు, కిరండూల్ - విశాఖ ప్యాసింజర్ స్పెషల్ (08552) రైలుకు డిసెంబర్ 2వ తేదీ నుంచి జనవరి 1 వరకూ ఒక స్లీపర్ క్లాస్ బోగీని పెంచుతారు. డిసెంబర్ 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, జనవరి 2 తేదీల్లో ఒక థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌ను జత చేస్తారు. మరోవైపు.. డిసెంబరులో గుంతకల్ డివిజన్‌లోని భద్రతా పనులు జరగనున్నాయి. ఈ క్రమంలో రైళ్లను నంద్యాల - ధోనే - అనంతపురం సాధారణ రూట్‌కు బదులుగా నంద్యాల - యర్రగుంట్ల - గూటి - అనంతపురం మీదుగా దారి మళ్లించనున్నారు.


Also Read: Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు