BRS MLC Kavitha Strong Counter To CM Revanth Reddy: తన రాజకీయ ప్రయాణంలో జైలు జీవితం చిన్న గ్యాప్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అన్నారు. జైలుకు వెళ్లొచ్చిన వారు సీఎం అవుతారనుకుంటే కేటీఆర్‌కు (KTR) ఆ ఛాన్స్ లేదని.. ఎందుకంటే కవిత ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సెన్సేషన్ కోసమే రేవంత్ అలాంటి కామెంట్స్ చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎంతో గుర్తు పెట్టుకునే రోజని.. 15 ఏళ్ల క్రితం ఇదే రోజున కేసీఆర్ మా మాట వినకుండా తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు వెళ్లారన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ 'దీక్షా దివస్'ను ఓ పండుగలా చేసుకుంటుందన్నారు.
లగచర్ల భూ సేకరణ విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గడం ప్రజా విజయమన్నారు. ప్రజలు కలిసి పోరాడితే విజయం ఇలాగే ఉంటుందని తెలిపారు. ఇకపై బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు పెంచుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తమ పోరాటం కొనసాగుతుందని.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాయని అన్నారు. ఇరు పార్టీలను ప్రజా కోర్టులో నిలబెడతామని పేర్కొన్నారు.
'ప్రాణ త్యాగానికి వెనుకాడలేదు'
పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి.. ప్రాణ త్యాగానికి వెనుకాడకుండా రాష్ట్రాన్ని సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. '2009లో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నప్పుడు చాలా మంది అవమానకరంగా మాట్లాడారు. తెలంగాణ వాదం ఇక లేదని అన్నారు. కానీ, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది. కేసీఆర్ చచ్చుడో... తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆయన ఉద్యమాన్ని ప్రారంభించి విజయం సాధించారు. మన కథను, తెలంగాణ జాతి వ్యధను రేపటి తరానికి నరనరాన ఎక్కించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. లేకపోతే మళ్లీ మన తెలంగాణ జాతి పరాయి దండయాత్రలో ఓడిపోయే ప్రమాదం ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వ దాడి రూపంలో మనకు కనబడుతుంది.' అని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు