Somu Veerraju BJP : కేంద్ర ప‌థ‌కాల‌కు మీ స్టిక్క‌ర్లు , రంగులు ఏంటీ .అంటూ జ‌గ‌న్ పై బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు.. ఈ మేర‌కు తాజాగా సోము సీఎం జగన్ కు మరో లేఖ రాశారు. కేంద్ర పథకాలపై మీ స్టిక్కర్లు ఏంటి? అంటూ సీఎం జగన్ ను నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పథకంపై రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ ఎలా అంటిస్తారని ప్రశ్నించారు. బియ్యం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ఏపీ ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఉచిత బియ్యం అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని రేషన్ బియ్యం వాహనాలపై ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని సోము డిమాండ్ చేశారు. కేంద్ర పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మార్గదర్శకాలు అమలు చేయాలని కోరారు..


 






 


ఏపీ పథకాలన్నీ కేంద్ర నిధులేనని బీజేపీ వాదన           


కేంద్రం ఏపీ ప్రభుత్వానికి కావాల్సినన్ని  నిధులు ఇస్తున్నప్పటికీ.. ఏమీ ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు.   సీఎం బటన్‌ నొక్కే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలేనని.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులా ఈ పథకాలు ప్రజల ముందుకు దూసుకొస్తున్నాయని చెబుతున్నారు.  కానీ, ప్రధాని మోదీ గొప్పతనం ప్రజలకు తెలియకూడదనే దుర్బుద్ధితో సీఎం తన స్టిక్కర్‌ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.   రాష్ట్రంలో 2.26 కోట్ల మందికి రేషన్‌ బియ్యం అందిస్తున్నామని చెబుతున్నారు.  


పథకాల పేర్ల విషయంలో కేంద్ర మార్గదర్శకాలు అమలు చేయాలంటున్న బీజేపీ  


రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని- కేంద్ర పథకాల విషయంలో మార్గదర్శకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. సీఎంకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు పెద్దపీట వేస్తే... రాష్ట్రంలో మాత్రం పిల్లలకు ఆంగ్లం చెప్పించేందుకు ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పిస్తామంటున్నారన్నారు. పాలనను సేవ బాధ్యతగా ప్రధాని మోదీ భావిస్తున్నారని చెప్పారు. బీజేపీ ఒక వ్యక్తికి మేలు చేయడానికి పని చేయదని.. దేశానికి, సమాజానికి మేలు చేయడాన్ని బాధ్యతగా భావిస్తుందని తెలిపారు. 


ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు నిధులు దుర్వినియోగం చేస్తున్నాయన్న బీజేపీ                





ఏపీలోని గత-ప్రస్తుత ప్రభుత్వాలు కేంద్ర నిధులను దుర్వినియోగం చేశాయన్నారు సోము వీర్రాజు. ఏపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని స్పష్టం చేశారు. నాడు-నేడు పేరుతో జరిగే పనులు.. జగనన్న కిట్లల్లో భాగంగా ఇచ్చే యూనిఫారాలన్నీ కేంద్ర నిధులే అని తేల్చి చెప్పారు. ఏపీలో జగన్ ప్రభుత్వం డబ్బింగ్ ప్రభుత్వంగా చెబుతున్నారు  సోము వీర్రాజు.