Somu Veerraju: వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు వచ్చిన నిధులన్నీ కేంద్రం నుంచి వస్తున్నవేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ విషయాలకు సంబంధించి బహిరంగ చర్చలకు అయినా తాము సిద్ధమేనని తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి చూస్తేనే.. ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
అనంతపురం నుంచి జనజాగృతి యాత్ర..
పాడైపోయిన రోడ్లను బాగు చేయించడం వైసీపీ ప్రభుత్వానికి చేత కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పోలవరం ప్రాజెక్టులో కమీషన్ కోసమే.. రెండు ప్రభుత్వాలు (తెదేపా, వైసీపీ) కాంట్రాక్టర్లను మార్చాయని వీర్రాజు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కడతామని చెప్పి తీసుకున్న అప్పు డబ్బులు ఏం చేశారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాల్సిందేనని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకున్న తెదేపా, వైసీపీ ప్రభుత్వాలు... ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు కట్టకపోవడానికి కారణం ఏమిటో వివరించాలన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ... అనంతపురం జిల్లా నుంచి జన జాగృతి యాత్ర ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆగస్టులో యువ సంఘర్ష యాత్ర..
అమలాపురం నియోజకవర్గంలో క్రాప్ హాలీ డే ప్రకటించడానికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వివరించారు. సరయిన గిట్టుబాటు ధర, ధరల నియంత్రణ లేకపోవడం వల్లే అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని చెప్పారు. నిరుద్యోగులకు చేసిన అన్యాయంపై యువ సంఘర్ష యాత్రను ఆగస్టు 2వ తేదీ నుంచి 14 వరకు నిర్వహిస్తామన్నారు. అలాగే అనంతపురం జిల్లాలో నాలుగు నేషనల్ హైవేల నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద 1.80 వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు
ఏపీకే ఎక్కువ నిధులిస్తున్నారు..
ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులను కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిందని సోము వీర్రాజు తెలిపారు. ఎన్ఆర్జీఎస్ నిధుల కింద నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తే వాటిని పంచాయతీలకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ఇండస్ట్రీలైజేషన్ కోసం కష్టపడుతున్నామన్నారు. అలాగే సబ్సిడీ బియ్యం కోసం నెలనెలా వెయ్యి కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి ఇస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా పేదలకు అందించే ఉచిత బియ్యాన్ని... రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుగా ప్రజలకు ఇవ్వడం లేదని సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.