SIT officials Arrest  Mithun Reddy: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో ఏ 4గా ఉన్న నిందితుడు , వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.   నోటీసులు జారీ చేయడంతో ఉదయం ఆయన సిట్ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. గతంలో ఓ సారి విచారణకు  హాజరైనా తర్వాత ముందస్తు బెయిల్ కోసం న్యాయపోరాటం చేస్తూ విచారణకు హాజరు కాలేదు. సుప్రీంకోర్టు  ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తప్పనిసరిగా సిట్ ఎదుట హాజరయ్యారు. సిట్ పలు అంశాలపై ఆయనను ప్రశ్నించారు. రాత్రి ఎనిమిదిగంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్లుగా ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్  చేశారు. ఆయనను ఆదివారం ఏసీబీ  కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. 

ఏపీ లిక్కర్ స్కాంలో లంచాలు వసూలు చేసి.. బిగ్ బాస్ కు ప్రతి వారం లెక్కలు చెప్పినందుకు  నెలకు రూ. ఐదు కోట్ల వరకూ మిథున్ రెడ్డికి అందాయని సిట్ ఆరోపిస్తోంది. ఈ నగదు అంతా .. మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ కంపెనీల్లోకి వివిధ రూపాల్లోకి వచ్చి  చేరింది. ఈ ఆధారాలన్నింటినీ ముందు పెట్టి సిట్ అధికారులు ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. అయితే దేనికీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వలేదని.. విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు  చేస్తున్నట్లుగా నోటీసులు ఇచ్చి అరెస్టు చేసినట్లుగా  తెలుస్తోంది. అరెస్టు చేస్తున్నట్లుగా ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

మిథున్ రెడ్డి 2019-2024 మధ్య YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానాన్ని రూపొందించడంలో ,అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాడని   SIT చెబుతోంది.   ఈ విధానం లంచాల ఆధారంగా లిక్కర్ బ్రాండ్ ఆర్డర్‌లను నిర్దేశించడానికి రూపొందించారని   మిథున్ రెడ్డి లంచాల వ్యవస్థను సమన్వయం చేశారని సిట్ అధికారులు గుర్తించారు.  మిథున్ రెడ్డి హైదరాబాద్ ,  విజయవాడలో మాజీ YSRCP నాయకుడు విజయసాయి రెడ్డి, రాజ్ కసిరెడ్డి వంటి వ్యక్తులతో సమావేశాలు నిర్వహించినట్లు SIT  ఆధారాలు సేకరించింది.  ఈ సమావేశాలలో మద్యం విధానం , లంచాల సేకరణకు సంబంధించిన చర్చలు జరిగాయని తెలిపింది.

 డిస్టిలరీల నుండి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు , సన్నిహితులకు సంబంధం ఉన్న కంపెనీలకు నిధులు బదిలీ అయినట్లుగా సిట్ ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.   గతంలో  ఏప్రిల్ 20, 2025న కూడా ఎనిమిది గంటలపాటు ప్రశ్నించింది. కానీ  చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని SIT తెలిపింది.  మిథున్ రెడ్డి ఈ కేసును రాజకీయ కక్షసాధింపు చర్యగా  ఆరోపిస్తున్నారు.   మద్యం విధానంతో సంబంధం లేదని, ఆధారాలు లేవని  అంటున్నారు. తాను SIT విచారణకు సహకరిస్తున్నానని, తన ఫోన్‌లను అధికారులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని  కూడా ప్రకటించారు. 

అరెస్టు చేసిన 24 గంటల్లోగా న్యాయమూర్తి  ముందుప్రవేశ పెట్టాల్సి ఉంది. అందుకే  మిథున్ రెడ్డిని ఆదివారం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందుప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో  ప్రాథమిక చార్జిషీట్  దాఖలు చేశారు. అందులో మిథున్ రెడ్డి ప్రస్తావన లేదని తెలుస్తోంది.