Wanted honeymoon in Switzerland Man slits others wife  throat for gold : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది.  కపిల్ కశ్యప్ (22) అనే వ్యక్తి, తన భార్యతో స్విట్జర్లాండ్‌లో హనీమూన్ ఖర్చుల కోసం డబ్బు సమకూర్చుకోవడానికి ఒక ప్రభుత్వ అధికారి భార్యపై దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు.  ఆమె బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. ఈ సంఘటన జూలై 9, 2025న లక్నోలోని ఇందిరానగర్‌లో జరిగింది. కపిల్ , అతని సహచరుడు రామ్ ధీరజ్ (22) ఎసి టెక్నీషియన్లుగా నటించి, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న హరిశ్చంద్ర పాండే ఇంట్లోకి ప్రవేశించారు. వారు హరిశ్చంద్ర భార్య శశి పాండేపై దాడి చేశారు.  ఆమె గొంతు కోసి, తలను గోడకు కొట్టి, ఆమె బంగారు గొలుసు,  చెవిరింగులను దోచుకుని పరారయ్యారు.

కానీ చివరిలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె చనిపోయిందని అనుకున్నారు. కానీ  బాధితురాలు ఈ దాడిలో బతికి బయటపడింది. పోలీసులకు కీలక సమాచారం అందించింది.  దాంతో నిందితుల్ని అరెస్టు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించి, బాధితురాలికి నిందితుల చిత్రాలను చూపించారు. దీని ఆధారంగా, ఇందిరానగర్‌లోని బస్టౌలీ తలాబ్ సమీపంలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దోచుకున్న చెవిరింగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  కపిల్‌పై గాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆరు  కేసులు ఉన్నాయి.   గూండా చట్టం కింద చర్యలు తీసుకుంటారు.  ఇతర జిల్లాల్లో  వారిపై ఉన్న కేసులను వెలికి తీస్తున్నారు.  

 కపిల్  20 రోజుల క్రితం ఒక మైనర్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె తనను హనీమూన్‌కు స్విట్జర్లాండ్ తీసుకెళ్లాలని కోరింది. ఈ కోరిక తీర్చడానికి  నేరానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించాడు. అతను విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడ్డాడని, గతంలో దోపిడీ ద్వారా సంపాదించిన డబ్బును ట్రిప్‌ల కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు.  దాడికి ముందు, కపిల్ , అతని సహచరుడు డ్రగ్స్  వినియోగించి ధైర్యం తెచ్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ మాదక ద్రవ్యాలకు బానిసలు.  ఇలాంటి దొంగతనాల్లో గతంలోనూ పాల్గొన్నట్లు వెల్లడైంది.   ఈ సంఘటన స్థానికంగా షాక్ సృష్టించింది. భద్రతపై ఆందోళనలు  రేకెత్తించింది.                   

ఈ ఘటనలో పోలీసులు,  భద్రతా  వైఫల్యం ఉందని.. సరిగ్గా దర్యాప్తు చేయలేదని..  ఆ మహిళ భర్త, ప్రభుత్వ ఉద్యోగి ఆరోపించారు.