Insurance Policy Tips: ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. అదే జీవితం. అయితే అనిశ్చితితో నిండిన జీవితానికి సంబంధించి మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. దుకే ప్రజలు బీమా (Insurance) పాలసీలు తీసుకుంటారు. ఈ రోజుల్లో, బీమా మనకు అవసరంగా మారింది. కొందరు కారు బీమా తీసుకుంటే, మరికొందరు హెల్త్ ఇన్సురెన్స్, లేదా జీవిత బీమా (Term Insurance) లాంటివి తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా బీమాతో మరింత భద్రతను కోరుకుంటారు.

ఇతరులపై ఆధారపడకుండా కష్ట సమయాల్లో ఈ బీమా మీకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఆర్థిక భారాన్ని తగ్గించడంలోనూ బీమా హెల్ప్ చేస్తుంది. చాలా మంది ఇన్సురెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. కొన్ని విషయాలు తెలిసినా, దాచిపెడతారు. లేదా తమకు అనుకూలమైన సమాచారం ఇస్తారు. అలాంటి పరిస్థితిలో, ఇన్సురెన్స్ కంపెనీ మీ క్లెయిమ్‌ను రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే ఇన్సురెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మీరు ఎప్పుడూ దాచిపెట్టకూడని కొన్ని విషయాలు ఇక్కడ అందిస్తున్నాం. 

బీమా (Insurance) తీసుకునేటప్పుడు ఈ విషయాలు దాచిపెట్టవద్దు

మీరు ఇన్సురెన్స్ పాలసీ తీసుకున్నప్పుడల్లా, పాలసీ ఫారంను ఫిల్ చేసేటప్పుడు సరైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం గురించి, ఏదైనా సమస్య లాంటివి ఉంటే మీరు ఎప్పుడూ దాచవద్దు. పాలసీ తీసుకునే సమయానికే మీకు ఏదైనా వ్యాధి, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఉంటే వెల్లడించడంతో ప్రీమియం  ధరపెరుగుతుంది. ఇలా భావించి మీ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు దాచిపెడుతుంటారు. కానీ ఇది భవిష్యత్తులో మీకు తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు. బీమా కంపెనీ మీ మెడికల్ హిస్టరీనీ తనిఖీ చేసే ఛాన్స్ ఉంది. క్లెయిమ్ సమయంలో మీరు పాలసీ సమయంలో సమాచారాన్ని దాచిపెట్టినట్లు తేలితే అప్పుడు మీ క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.

ఇదే విషయం వెహికల్ ఇన్సురెన్స్ లేదా ప్రాపర్టీ ఇన్సురెన్స్, టర్మ్ ఇన్సురెన్స్ లాంటి ఇతర బీమా పాలసీలకు కూడా వర్తిస్తుంది. ఏవైనా ప్రమాదకర, ముఖ్యమైన విషయాలు ఉంటే, వాటిని ఎప్పుడూ దాచవద్దు. మీరు పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తే, మీ క్లెయిమ్ ఈజీగా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ కావడానికి ఎటువంటి సమస్య ఉండదు. ఏదైనా సమాచారం దాచిపెడితే, బీమా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే మీరు ఆశించినంత కాకుండా చాలా తక్కువ మొత్తం క్లెయిమ్ అప్రూవ్ చేస్తారు.

ఇన్సురెన్స్ తీసుకునేటప్పుడు ఈ విషయాలపై ఫోకస్ చేయండి

ఇన్సురెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మీరు ఏ విషయాలు బీమా కంపెనీ వద్ద దాచకూడదు. లేకపోతే, భవిష్యత్తులో అది నష్టాన్ని కలిగించవచ్చు. కానీ సమాచారాన్ని దాచడం మాత్రమే మిస్టేక్ కాదు. ఇన్సురెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ చూపాలి. బీమా పాలసీ తీసుకునేటప్పుడు, ప్రజలు తరచుగా ప్రీమియంను మాత్రమే చూసి డిసైడ్ చేసుకుంటారు.

అలా చేయడం సరికాదు. వాస్తవానికి మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆ ఇన్సురెన్స్ పాలసీ ఎంత వరకు అవసరం. దాని ప్రయోజనం ఏంటి అనే విషయాలు పరిగణనలోకి తీసుకుని సరైన సమాచారంతో పాలసీ తీసుకోవాలి. మీకు ఎంత కవరేజ్ అవసరం, మీ హెల్త్ పాలసీ ఎలాంటి వ్యాధులు లేదా ప్రమాదాలను ఇన్సురెన్స్ కవర్ చేస్తుంది. మినహాయింపులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా యాడ్ ఆన్ చేసే అవకావం ఉందా అని పరిశీలించుకోవాలి. టర్మ్ ఇన్సురెన్స్ తీసుకునేవాళ్లు క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఎంత, తక్కువ సమయంలో మీకు అప్రూవల్ చేసే సంస్థల పాలసీలు తెలుసుకుని కొనుగోలు చేయాలి.