Simhachalam Temple Wall Collapse | సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలైన్లలో గోడ కూలి 7 మంది భక్తులు చనిపోయారు. ఇప్పటికే ఏడుగురు భక్తుల మృత దేహాలను వెలికితీసి కేజీహెచ్‌కు తరలించారు. మంగళవారం అర్థరాత్రి తర్వాత వచ్చిన భారీ వర్షం, ఈదురుగాలులకు షెడ్లు కూలిపోయాయి.
3౦౦ రూపాయల క్యూలైన్లలో కొత్తగా కట్టిన గోడ వర్షానికి కూలిపోయింది. 7 మంది చనిపోగా, మరో 10 మంది వరకూ గాయపడ్డారు. ప్రమాద ఘటన వద్ద సహాయక చర్యలు ముగిశాయని అధికారులు తెలిపారు. గోడ కూలిన ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా, మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని అధికారులు ప్రకటించారు.
సహాయక చర్యలను పర్యవేక్షించిన హోంమంత్రి అనిత
ఘటనా స్థలాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, విశాఖ సీపీ బాగ్చీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే సింహాచలంలో గోడకూలిన స్థలానికి హోంమంత్రి అనిత చేరుకున్నారు. గోడకూలిన ప్రాంతంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలినట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నేతృత్వంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు.
సింహాచలం ఆలయంలో క్యూలైన్లో భక్తులపై గోడకూలిన ఘటనపై రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు గోడ కూలి ఏడుగురు భక్తులు చనిపోగా, పలువురు గాయపడడం తీవ్రంగా బాధించిందన్నారు. గోడ కూలిన ప్రాంతంలో సహాయక చర్యలను మంత్రులు, అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నాం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నాం. భక్తులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. హోం మంత్రి అనిత సహా అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం
విశాఖలోని సింహాచలంలో వరహా లక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో దర్శనమిస్తున్నారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకునేందుకు భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో అర్చకులు మేల్కొలిపారు. అనంతరం స్వామివారిపై ఉన్న చందనాన్ని వేరుచేశారు. నిజరూపంలో దర్శనం ఇస్తున్న స్వామికి అభిషేకాలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు మొదటగా నిజరూప దర్శనం చేసుకుంటారని తెలిసిందే. దురదృష్టవశాత్తూ అప్పన్న ఆలయం క్యూలైన్ గోడ కూలడంతో విషాదం నెలకొంది. సింహాది అప్పన్న నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తులు చనిపోయారు.