ABP  WhatsApp

AP Skill Case: ఏపీ స్కిల్ కేసు బోగస్, ఈ ఆరోపణలు చూసి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాట్లేదు - సీమెన్స్ మాజీ ఎండీ కీలక వ్యాఖ్యలు

ABP Desam Updated at: 17 Sep 2023 01:25 PM (IST)

సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ మీడియా సమావేశం నిర్వహించారు. స్కిల్ డెవలప్‍మెంట్ కేసు నిరాధారమైందని అన్నారు.

సుమన్ బోస్, సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ

NEXT PREV

స్కిల్ డెవలప్‍మెంట్ కేసు నిరాధారమైందని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ అన్నారు. తన జీవితంలో తాను ఎంతో గౌరవం సంపాదించుకున్నానని అన్నారు. ఒక హత్య జరిగితే విచారణ చేస్తారని.. కానీ, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచిత్రంగా హత్యకు (స్కామ్) గురైనట్లుగా చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడని అభివర్ణించారు. బతికుండగానే హత్య (స్కామ్) జరిగిందని విచారణ చేస్తామంటున్నారని అన్నారు. దీనికి సంబంధించి సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ మీడియా సమావేశం నిర్వహించారు.


‘‘ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్రంలో కంపెనీ విషయమై మీ ముందుకు తెస్తున్నా. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడమే ప్రాజెక్టు లక్ష్యం. 2014లో ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దేశంలో 200కు పైగా ల్యాబ్‍లను ప్రారంభించాం. సీమెన్స్ కంపెనీ, ఏపీఎస్‍ఎస్‍డీసీ మధ్య ఒప్పందం ఉంది. ఒక సాప్ట్ వేర్‍పై యువతకు అవగాహన కల్పిస్తే దానికి డిమాండ్ పెరుగుతుంది. మార్కెటింగ్ లో భాగంగానే ప్రభుత్వం, సీమెన్స్ మధ్య 90:10 ఒప్పందం జరిగింది. 



సిమెన్స్ తో అగ్రిమెంట్ జరగలేదు అని సీఐడీ ఆరోపణ అవాస్తవం. APSSDC ప్రభుత్వ సంస్థ కాదా? ఎండీగా నేను, మా కంపెనీ సీఎఫ్ఓ సంతకం చేశాం. ఈ తప్పుడు ఆరోపణలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. తప్పుడు ఆరోపణలు చేయడం సులువు. రెండున్నర ఏళ్లుగా ఒక్క సాక్ష్యం చూపించలేకపోయారు.. నిజం ఎప్పటికి నిజమే-


నేను వెళ్లిపోయాకే అనూహ్య పరిణామాలు
ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. 2021 వరకు స్కిల్ డెవలప్‍మెంట్ ద్వారా 2.32 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2.32 మందికి సర్టిఫికేషన్ ఇస్తే వారు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. లక్ష బిల్ట్ ఆపరేటర్- ట్రాన్స్ ఫర్ ఆపరేట్ పద్ధతిలో ఈ ప్రాజెక్టు నడిచింది. 2021లో ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించేశాం. ప్రాజెక్టు విజయవంతమైందని ఏపీఎస్‍ఎస్‍డీసీ ఎండీ కూడా మెచ్చుకున్నారు. 2018లోనే ఈ ప్రాజెక్టు నుంచి నేను బయటకు వెళ్లిపోయాను. 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీఎస్‍ఎస్‍డీసీలో ఏం జరిగిందో నాకు తెలియదు. 






ఇది విజయవంతమైన ప్రాజెక్టు
గతంలో మెచ్చుకున్న ఏపీఎస్‍ఎస్‍డీసీనే ఈ ప్రాజెక్టు బోగస్ అని ఆరోపించింది. శిక్షణ కేంద్రాలు చూడకుండానే అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఒక్క కేంద్రం సందర్శించలేదు.. ఒక్క తనిఖీ జరగలేదు. ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ. ఒక హత్య జరిగిందని విచారణ చేయాలంటున్నారు. విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు. బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు. నాపై, ఇతరులపై తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారు. స్కిల్ డెవలప్‍మెంట్.. చాలా విజయవంతమైన ప్రాజెక్టు -2016లో కేంద్రం విజయవంతమైన నమూనాగా ప్రకటించింది. ప్రాజెక్టు అందించిన అంతిమ ఫలితాలు చూసి మాట్లాడాలి. స్కిల్ డెవలప్‍మెంట్ ఫలితాలు మన కళ్ల ముందే ఉన్నాయి. స్కిల్ డెవలప్‍మెంట్ ప్రాజెక్టు నూరు శాతం విజయవంతమైంది. 


డిస్కౌంట్స్‌లో అవినీతి ఎలా సాధ్యం?
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి జరగలేదు. అన్నీ అధ్యయనం చేశాకే ఈ ప్రాజెక్టు ప్రారంభించాం. ప్రాజెక్టులో అధిక భాగం సీమెన్స్ నుంచి డిస్కౌంట్స్ రూపంలో అందింది. డిస్కౌంట్స్ లో అవినీతి సాధ్యమని ఎలా చెబుతారు? సీమెన్స్ తో ఒప్పందం జరగలేదనడం పూర్తి అబద్దం. ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఏపీ స్కిల్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా? ఏలాంటి మనీలాండరింగ్ జరగలేదు. కోర్టుల పరిధిలో ఉన్నందున కోర్టులకు అన్ని విషయాలు చెబుతాం. ముగ్గురి మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం ఇది. సీమెన్స్ పై చేస్తున్న ఆరోపణలు అన్నీ బోగస్. 


కియా కూడా మెచ్చుకుంది
ఇదే తరహా ప్రాజెక్టు చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం.. చేస్తున్నాం. కియా మోటర్స్ సంస్థ కోసం మానవ వనరులకు పూర్తి శిక్షణ ఇచ్చాం. గొప్పగా శిక్షణ ఇవ్వడంపై కియా సంస్థ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రూ.321 కోట్ల ప్రాజెక్టులో రూ.10 కోట్లే సీమెన్స్ కు వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న మొత్తం డిజైన్ టెక్ సంస్థ ఖాతాకు వెళ్లింది. డిజైన్ టెక్ సంస్థ అందరికీ నిధులు విడుదల చేసింది. సీమెన్స్ లో ప్రాజెక్టు అప్రూవల్‍కు అన్ని పత్రాలు ఉన్నాయి. ఈ ఒప్పందంలో తేదీల్లో మార్పులున్నాయి అనడంలో వాస్తవాలు లేవు. అందరం ఒకేసారి ఒప్పందంపై సంతకాలు చేశాం. ఆరోజు విద్యుత్ పోతే.. కొవ్వొతులు పెట్టుకుని చేశాం. ఇప్పటివరకు చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇలాంటి ఆరోపణలు పలువురి జీవితాలపై ప్రభావం చూపుతాయి’’ అని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ వివరించారు.

Published at: 17 Sep 2023 01:20 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.