Sharmila In Congress : కాంగ్రెస్‌లో చేరుతున్నానని షర్మిల ప్రకటించారు. కుటుంబ సమేతంగా ఇడుపుల పాయ YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ మొదటి పత్రికను YSR ఘాట్ వద్ద ఉంచారు. ఈ తర్వాత మీడియాతో మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుందని.. ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద వివాహ పత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందన్నారు. వైఎస్సార్ తో పాటు ప్రజలందరి దీవెనలు కొత్త దంపతులపై ఉండాలని కోరుకున్నారు.
కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయం !
కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించామని షర్మిల తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామన్నారు. ఇవ్వాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందన్నారు. కేసీఅర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో YSRTP చాలా పెద్ద పాత్ర పోషించిందని గుర్తు చేశారు. 31 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 10 వేల లోపు మెజారిటీతోనే గెలిచారని.. దీనికి కారణం YSR తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడమేనన్నారు. YSRTP ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ కి ఇబ్బంది అయి ఉండేదని గుర్తు చేశారు.
మా వల్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది
ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉందని తెలిపారు. మా త్యాగానికి విలువ నిచ్చి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానం పంపారని.. కాంగ్రెస్ లో చేరడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సెక్యులర్ పార్టీ.. ప్రతి ఒక్కరికీ భద్రత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నిర్ణయించుకున్నామన్నారు. బుధవారమే ఢిల్లీకి వెళ్తున్నాం.. ఒకటి రెండు రోజుల్లో అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని తెలిపారు. ఏపీలో రాజకీయాలపై ఇలా స్పందించారు.
ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీపై నాలుగో తేదీన నిర్ణయం
4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే, షర్మిలకు ఏఐసీసీ పదవి అప్పగిస్తారా? ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారా? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతుంది. రాహుల్ గాంధీ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అలాకాకుంటే ఏఐసీసీ, సిడబ్ల్యుసీలో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.