JD Laxminarayana:  ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా అంశంపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పుడో మాట్లాడటం మానేశాయి. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రత్యేకహోదాను ఎన్నికల అంశంగా చేసేందుకు ఆసక్తిగా లేవు. కానీ షర్మిలతో  పాటు జై భారత్ నేషనల్  పార్టీ చీఫ్ జేడీ లక్ష్మినారాయణ హోదా అంశాన్ని గట్టిగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ రాజకీయాలకు ముడి పెడుతున్నారు. 


బడ్జెట్‌ను ఆమోదించవద్దని లక్ష్మినారాయణ పిలుపు


ప్రజలలో చైతన్యం రావాలి.. ఏపీకి ప్రత్యేక హోదా విషయం పోరాడాలి అని పిలుపునిచ్చారు జై భారత్‌ పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాణ..  ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్ పాస్ కాకుండా చూడాలి‌.. బడ్జెట్‌ను స్తంభింపజేస్తే కేంద్రం ఆలోచిస్తుందన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధించేందుకు అనేక అవకాశాలు వచ్చాయి.. 2019 నుంచి ప్రతిసారీ రాష్ర్టానికి చెందిన ఉభయపార్టీలు.. ఎన్టీఏకు మద్దతు పలికారు. అడకముందే మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హాదాపై టీడీపీ, వైసీపీకి చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. ముగించిన హామీగా పేర్కొన్నారు.   22 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై సీఎం వైఎస్‌ జగన్‌ ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని విమర్శించారు లక్ష్మీనారాయణ.. 14వ పైనాన్స్ కమిషన్ ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పలేదన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే ఇవ్వొచ్చని కమిషన్‌ చెప్పిందని గుర్తుచేశారు. 12వ పైనాన్స్ కమిషన్ చెప్పిన ప్రాపిట్ పెట్రోలియం గుర్చి ఎందుకు మాట్లాడరు? అంటూ రాజకీయ నేతలను ప్రశ్నించారు.  


హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేయనున్న షర్మిల


ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రత్యేకహోదా అస్త్రంలో ప్రధానంగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ధర్నాకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రెండో తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ప్రత్యేకహోదాపై ధర్నా చేయనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతల్ని ఢిల్లీకి రావాలని ఆదేశించారు కొంత మంది ఏఐసీసీ నేతలు కూడా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదాను ఇస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. గతంలోనూ ఆదే ప్రధాన హామీగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో ఆ హామీకి విలువ లభించలేదు. కానీ ఇప్పుడు షర్మిల లాంటి నాయకత్వం రావడంతో.. హోదా అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. షర్మిల కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేయాలనుకుంటున్నారు. ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. హోదా అంశంపబై చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు జరిగే అవకాశం ఉంది.


హోదా ఎన్నికల అంశం అవుతుందా ?


ప్రత్యేకహోదాను ఎన్నికల అంశంగా చేయడానికి షర్మిల, లక్ష్మినారాయణ ప్రయత్నిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే ఎన్నికల అంశం అయింది. హామీైలు ఇచ్చిన రాజకీయ పార్టీలు లాభపడ్డాయి. కానీ హోదా మాత్రం రాలేదు. దీంతో ఈ అంశంపై ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయినట్లయింది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్, జై భారత్ నేషనల్ పార్టీలు కలిసి హోదా అంశంపై ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాల్సిఉంది.