AP Volunteers Distributes Pension: అమరావతి: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం, అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు వాలంటీర్లను ఎన్నికల పనుల నుంచి తప్పించాలని, వారితో ప్రచారం కూడా చేయించవద్దని ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఏప్రిల్, మే నెలల్లో వాలంటీర్లు లబ్ధిదారులకు పింఛన్ అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాలంటీర్లకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఓ సర్క్యులర్ జారీ చేసింది.
ఎన్నికల కోడ్ ఉన్నందున ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని వాలంటీర్లకు సెర్ప్ సూచించింది. లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చేందుకు బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్ డాక్యుమెంట్ తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాలంటీర్లు ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని పేర్కొన్నారు.
మార్చి నెలలో జరిగినట్లు ఏప్రిల్, మే నెలలో చేయకూడదంటూ వాలంటీర్లకు సెర్ప్ కొన్ని సూచనలు చేసింది. పెన్షన్ పంపిణీ చేస్తున్న సమయంలో ఫొటోలు గానీ, వీడియోలు గానీ తీయడం లాంటివి చేయకూడదని వాలంటీర్లకు సూచించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, ఏ అభ్యర్థికైనా ఓటు వేయాలంటూ లబ్ధిదారులకు చెప్పినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.