AP Assembly Elections 2024: అమరావతి: త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల (BJP MLA Candidates)ను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కూటమిలో బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. గత కొన్ని రోజులుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులపై కసరత్తు చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
నియోజకవర్గం - అభ్యర్థుల పేర్లు
ధర్మవరం - సత్యకుమార్
ఎచ్చెర్ల - ఈశ్వరరావు
విశాఖ నార్త్ - విష్ణుకుమార్ రాజు
అనపర్తి - శివకృష్ణంరాజు
విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి
అరకు(ST) - పాంగి రాజారావు
బద్వేలు(SC) - బొజా రోషన్న
కైకలూరు - కామినేని శ్రీనివాస రావు
ఆదోనీ - పీవీ పార్థసారథి
జమ్మలమడుగు - ఆదినారాయణరెడ్డి
ధర్మవరం టికెట్ కోసం కూటమి నేతలు ముగ్గురు పోటీ పడగా చివరికి బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ వైపు మొగ్గుచూపారు. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరం టికెట్ తనకే వస్తుందని భావించారు. మరోవైపు పొత్తు ఖరారు అయిన తరువాత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల రేసులోకి వచ్చారు. ఆపై బీజేపీ నుంచే సత్యకుమార్ ధర్మవరం సీటు ఆశించారు. చివరికి సత్యకుమార్ ను ధర్మవరం నుంచి బరిలోకి నిలుపుతున్నట్లు బీజేపీ తాజా జాబితాలో ప్రకటించింది.
విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, విజయవాడ వెస్ట్ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, కైకలూరు నుంచి రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి టికెట్ దక్కించుకున్నారు.
కూటమిగా ఏర్పడి ఎన్నికలకు..
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి వైఎస్ జగన్ ను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు వచ్చాయి. బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో చంద్రబాబుకు చెందిన టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన జగన్, చంద్రబాబు
వైసీపీ అధినేత, సీఎం జగన్ వైనాట్ 175 అంటూ సింగిల్ గా ఎన్నికలకు వెళ్తున్నారు. తమకు ప్రజలతోనే పొత్తు అని, తమకు సామాన్యులే స్టార్ కంపెయినర్లు అని వైఎస్ జగన్, ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధమంటూ బస్ యాత్రను ప్రారంభించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం బుధవారం నాడు ఏపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. దాంతో ఏపీలో ప్రచార హోరు ఇక మొదలైందని, ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇకనుంచి మరో లెక్క అనే ఎన్నికల వాతావరణం కనిపించనుంది.