500 units of free electricity will be given to powerlooms :  చేనేత కార్మికులకు చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. పవర్ లూమ్స్ పెట్టుకున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని నగరి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రకటించారు. అంతకు ముందు పలమనేరు నియోజకవర్గంలోనూ ప్రజాగళం ప్రచారసభ నిర్వహించారు.  యువత ఆశలను సీఎం జగన్ వమ్ము చేశారని  విమర్శించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా పలమనేరులో ఆయన మాట్లాడారు.


ఐదేళ్లలో పాతిక లక్షల ఉద్యోగాలు                                   


అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జగన్ మోసపూరిత మాటలతో ప్రజలను ఐదేళ్ల పాటు మోసం చేశారన్నారు. రాయలసీమ అభివృద్ధికి జగన్ చేసిందేమి లేదన్నారు. అనంతపురానికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. కియా పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటయ్యేలా టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు దివంగత నేత ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టులను తాను మరింత అభివృద్ధి చేశానని తెలిపారు. నీళ్లు వస్తే పరిశ్రమలు వస్తాయి.. నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. జగన్‌ సిద్ధం అంటూ మరో మెసపూరిత యాత్రకు వస్తున్నారని.. ఆయనకు ఖాళీ రోడ్లతో స్వాగతం పలకాలని సూచించారు.


రాష్ట్రానికి విముక్తి కలిగించే  రోజు మే 13         


జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తమ వద్దకు రావడానికి వీలులేదని ప్రజలంతా జగన్‌కు చెప్పాలన్నారు. ఏపీని జగన్ సర్వ నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజు మే13వ తేదీ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఆరోజుతో రాష్ట్రానికి పట్టిన జగన్ అనే శని వదిలిపోతుందని తెలిపారు. జే బ్రాండ్ మద్యం, గంజాయి నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించే రోజు మే 13 అవుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి.. జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.


జగన్ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి                           


ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదని, పెన్షనర్లకు ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు రాయలసీమ రత్నాల సీమగా ఉండేదని, రాయలవారు ఏలిన ప్రాంతాన్ని జగన్ సర్వనాశనం చేసారన్నారు. నాడు దివంగత నేత ఎన్టీఆర్ రాయలసీమను‌ సస్యశ్యామలం చేశారన్నారు. కరువు సీమగా ఉన్న రాయలసీమలో అన్ని రంగాలను తాను సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశానని చంద్రబాబు తెలిపారు. పరదాల వీరుడు జగన్ నేడు ముసుగులతో బస్సుయాత్ర మొదలుపెట్టారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెరగవని హామీ ఇచ్చారు.