Political Controversy started another container Issue in AP  :   డ్రగ్స్ కంటెయినర్ వ్యవహారం హాట్ టాపిక్ గానే ఉండగానే..  మరో కంటెయినర్‌పై ఏపీ రాజకీయాల్లో చర్చ ప్రారంభమయింది. మంగళవారం సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు దగ్గరకు ఓ కంటెయినర్ వచ్చింది. పోలీస్ స్టిక్కర్ తో ఆ కంటెయినర్ ఉంది. కానీ పోలీసు వాహనం కాదు. రిజిస్ట్రేషన్ నెంబర్ ను బట్టి ఆర్టీసీ వాహనంగా భావిస్తున్నారు. ఆ కంటెయినర్ .. సీఎం క్యాంప్ ఆఫీస్ గేట్ వద్ద కాస్త లోపలికి వెళ్లి వస్తువుల్ని దింపడమో.. లేకపోతే  ఏదో లోడ్ చేసుకుని వెళ్లడమో జరిగింది. ఈ దశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విమర్శలు ప్రారంభించింది. అ  కంటెయినర్‌లో ఏం తెచ్చారు.. ఏం తీసుకెళ్లారన్నదానిపై  ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియా ఈ విషయంలో అనేక ప్రశ్నలు సంధిస్తోంది.   





 


అయితే ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో స్పందించింది. ఆ కంటెయినర్.. వంట సామాన్లను తీసుకెళ్లిందని.. అది ప్యాంట్రీ కార్ అని స్పష్టం చేస్తూ వీడియో  పోస్ట్ చేసింది.   





ఈ అంశంపై టీడీపీ నేత పట్టాభి మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. కంటెయినర్‌లో అట్టపెట్టెల్లో డబ్బుల కట్టలున్నాయని వాటిని ఆర్టీసీ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారన్నారు. సీసీటీవీ పుటేజీలు బయట పెట్టాలని పట్టాభి డిమాండ్ చేశారు. 


ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆ వాహనాన్ని ఎవరూ తనిఖీ చేయకపోవడం వివాాదాస్పదమవుతోంది.  తన వాహనాన్ని ఉదయం సాయంత్రం తనిఖీలు చేస్తున్న  పోలీసులు ఆ వాహనాన్ని ఎందుకు తనిఖీ చేయలేదని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.  సీఎం జగన్‌ ఇంటి దగ్గరికి వెళ్లిన కంటెయినర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించారు. నిబంధనలు ఎందుకు పాటించలేదని నిలదీశారు. ఆ కంటెయినర్‌లో ఏముందని ప్రశ్నించారు. బ్రెజిల్ సరుకా? లిక్కర్ మాఫియా ద్వారా మెక్కిన వేల కోట్లా? ఏపీ సెక్రటేరియట్‌లో ఇన్నాళ్లూ దాచిన దొంగ ఫైళ్లా? అని  లోకేశ్‌ ట్వీట్ చేశారు. డీజీపీ సమాధానం చెబుతారా? అని ప్రశ్నించారు.