Dadi Veerabhadra Rao  has resigned from YCP :  ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు. లేఖను విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకూ పంపారు. కానీ ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి లేఖ రాయలేదు. ప్రస్తుతం వైసీపీలో టిక్కెట్ల కసరత్తు జరుగుతోంది. ఏ స్థానానికి కూడా దాడి కుటుంబం నుంచి ఓ పేరును పరిశీలించడం లేదు. ఈ కారణంగా ఆయన అసంతృప్తికి గురయ్యారు. తనకు లేదా తన కుమారుడికి టిక్కెట్ కేటాయించాలని ఆయన కోరుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసే ముందు ఆయన జనసేన వర్గాలతో సంప్రదింపులు జరిపినట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజుల్లో ఆయన జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 


టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత  రాజకీయంగా వెనుకబడిపోయిన దాడి వీరభద్రరావు              


దాడి వీరభద్రరావు చాలా కాలం టీడీపీలో ఉన్నారు. మాజీ మంత్రిగా పని  చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆయనను కలిసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడు దాడి రత్నాకర్ విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. పవైసీపీ ఓడిపోవడంతో ఆయన కొద్ది కాలానికి వైసీపీకి రాజీనామా చేశారు. కానీ ఏ పార్టీలో చేరలేదు. తెలుగుదేశం పార్టీలో చేరదామనుకున్నా ఆయనకు స్థానిక రాజకీయాలు దారి ఇవ్వలేదు.  దాంతో సైలెంట్ గా ఉండిపోయారు. మధ్యలో పవన్ కల్యాణ్ కూడా దాడి వీరభద్రరావుతో ఒకటి రెండు సార్లు సమావేశం అయ్యారు కానీ.. జనసేనలో చేరలేదు. తర్వాత మళ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు కనీ ఆయన కుటుంబానికి కానీ అవకాశం ఇవ్వలేదు.


వైసీపీకి  రెండో సారి రాజీనామా  


ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఏదో ఓ నమినేటెడ్ పోస్టు అయినా ఇస్తారేమో అనుకున్నారు. కానీ దాడి కుటుంబాన్ని సీఎం జగన్ అసలు గుర్తించలేదు. ఏ పోస్టూ ఇవ్వలేదు. పార్టీలో ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. దీంతో దాడి కుటుంబం చాలా కాలంగా రాజకీయంగా కార్యకలాపాలేమీ లేకుండానే ఉంది. ఇప్పుడు దాడి వీరభద్రరావు జనసేన పార్టీతో సంప్రదింపులు జరిపి.. గ్రీన్ సిగ్నల్ రావడంతో.. వైసీపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. దాడి వీరభద్రరావు రాజీనామాను వైసీపీ తేలికగా తీసుకుంది.,


జనసేనలో సీటు లభిస్తుందా ?                                 


టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలనుకుంటోంది. ఈ క్రమంలో  పోటీ చేసే అవకాశం వస్తుందేమోనన్న ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అంతర్గతంగా చర్చలు పూర్తయిన తర్వాతనే ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.