దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో క్రైస్తవ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.... దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. స్మశాన వాటికలపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నామన్నారు. కొన్నిచోట్ల స్మశాన వాటికలు లేని చోట్ల ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. సచివాలయాల వారిగా ఎస్సీలకు స్మశాన వాటికలు లేని చోట ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో క్రైస్తవ ప్రతినిధులు పలు అంశాలపై చర్చలు జరిపారు. డీబీటీ వల్ల చివరన ఉన్న లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా సీఎం ఉన్నారని కొనియాడారు. బరియల్ గ్రౌండ్స్ సమస్యను పరిష్కరించాలని, చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు సీఎం జగన్ కోరారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూలు, సేవ భవనాలకు మున్సిపల్ నుంచి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్ కు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. మతం మారినంత మాత్రాన పేదరికం పోదని క్రైస్తవ ప్రతినిధులు పేర్కొన్నారు.


అలాగే చర్చిలు, వాటి ఆస్తుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణ రూపొందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. క్రైస్తవ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసేందుకు త్వరలో ఒక సలహాదారుని నియమిస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చినట్లు క్రైస్తవ సంఘాల ప్రతినిధుల బృందం తెలిపింది.


 బడుగు, బలహీనవర్గాలకు, మైనార్టీలకు తమ ప్రభుత్వం బాసటగా ఉంటుందని అన్నారు. క్రైస్తవులు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.  క్రైస్తవ వర్గాల  నొప్పించేలా తమ ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు.  అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై  చర్చ విపరీతంగా నడుస్తోందన్నారు. వాటిని చూసి క్రైస్తవులు పెద్దస్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.  ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న తాను అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 


అయితే ఇదే సమయంలో మీరంతా ఇదే  పరిస్థితుల్లో  ఉంటే  ఏం చేసేవారన్నదానిపై  ఆలోచనలు చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. క్రైస్తవుల  ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏ తండ్రి అయినా.. ఏ తల్లి అయినా ఎందుకు భేదభావాలు చూపుతారని ప్రశ్నించారు. మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీలేదనే విషయాన్ని అందరి కలసి స్పష్టం చేద్దామని అన్నారు. 


తమ ప్రభుత్వం బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. భారతదేశం చాలా విభిన్నమైనదని, దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నాయని చెప్పారు. ఒకే మతంలో ఉన్న వివిధ కులాలు, వర్గాలకూ వివిధ రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయని పేర్కొన్నారు.