పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో  జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో స్టెప్పులేసి అందరిలో జోష్ పెంచారు. స్థానిక బంజారా మహిళలతో కలిసి అంబటిరాంబాబు డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.


తిరుపతి జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. ఈ సంబరాల్లో  ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే. రోజా స్పెషల్ ఎట్రాక్షన్‌లా నిలిచారు. భోగి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. ప్రతి ఏడాది మంత్రి రోజా సొంత నియోజకవర్గంమైన నగిరిలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంత్రి రోజా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.


టిడిపి అధినేత‌ నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో చంద్రబాబు, లోకేష్‌, హీరో బాలృష్ణ సందడి చేశారు. మార్నింగ్ వాక్ చేసిన అనంతరం బాలకృష్ణ బోగి మంటలు వేశారు. భోగి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నట్లు బాలకృష్ణ చెప్పారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఆయన తెలిపారు..






తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఎదుట బోగి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి మోహన్ బాబు జరుపుకున్నారు. సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని సీనీ నటుడు మోహన్ బాబు కోరారు. విద్యానికేతన్ విద్యా సంస్థల్లో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. చీకటిని పారద్రోలి వెలుగును నింపే పండుగ భోగి అని మోహన్ బాబు అన్నారు. 


తిరుమలలో సంక్రాంతి సంబరాలు మొదలైయ్యాయి. భోగి పండుగ సందర్భంగా శ్రీవారి ఆలయం ముందు సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించారు. వేకువజామున ఆలయం ముందు అర్చకులు, సిబ్బంది భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మారిన తర్వాత మొదటిగా వచ్చే పండుగ భోగి, సంక్రాంతి, కనుమ ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు.


గుంటూరులోని ఎన్టీయార్ స్టేడియంలో  నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి.  భోగి సంబరాల్లో  మేయర్ కావటి మనోహార్ నాయుడు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మేయర్‌ కావటి మనోహర్ నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం డప్పులు కొట్టి  డాన్స్ లతో సందడి చేశారు.