Sajjala On Tapping : వేరే వాళ్లు పంపించిన ఫోన్ రికార్డింగ్ ను ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పంపించి ఉండవచ్చునని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. జాగ్రత్తగా ఉండాలని సూచించి ఉంటారని అన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని అందుకే ఇలాంటి ఆరోపణల్ని కో ఆర్డినేటెడ్ గా చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని.. ఫోన్ ట్యాంపింగ్‌లను కాదని సజ్జల చెప్పుకొచ్చారు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పడంపై ఎవరు.. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చునని సజ్జల వ్యాఖ్యానించారు.
పార్టీకి తీవ్ర నష్టం జరిగేలా వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డిపై చర్యలు తీసుకునే విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆచితూచి స్పందించారు. కోటంరెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని.. ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శ్రీధర్ రెడ్డి నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ సొంత పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై కూడా అధికార యంత్రాంగంతో కూడా విచారణ చేయించడం ద్వారా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వాన్ని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వంలోని పెద్దలతో పాటు అటు అధికార యంత్రాంగంతో ఆరా తీయించే పనిలో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రోజు రోజు కు కోటంరెడ్డి దూకుడు పెంచడంతో సీఎంవో నుంచి కూడా ఈ అంశంపై ఆరాతీస్తున్నారు. మంత్రులతో పాటు కేంద్ర పార్టీ కార్యాలయం వేదికగా నేతలతో సీఎంవో అధికారులు మాట్లాడడంతో పాటు పోలీస్, నిఘా వర్గాల నుంచి కూడా సీఎంవో అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. తాజా గా కోటంరెడ్డి ఐఏఎస్ అధికారులను కూడా ఇన్వాల్వ్ చెయ్యడంతో ఆ దిశగా కూడా ప్రభుత్వం విచారణ చేయించాలని భావిస్తోంది.
కోటంరెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలు పరిశీలించడంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ వీడియోలు కూడా క్షుణ్నంగా పరిశీలించి, ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వాన్ని, పార్టీని టార్గెట్ చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు నిర్దారణకు వచ్చాయి. ఈ అంశంపై ప్రభుత్వం అధికారికంగానే స్పందించాలని అనుకుంటోంది. ఆరోపణలు చేస్తున్నది సొంత పార్టీ నేతలే కాబట్టి వారిపై రాజకీయంగా దూకుడుగా వెళ్తే తమకే నష్టమని అంచనా వేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ట్యాపింగ్ వ్యవహారం ముందు ముందు ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది.