అమరావతి: కాంగ్రెస్ పార్టీలో చేరగానే షర్మిల యాస, భాష మారాయని.. ఆమెను చూస్తే జాలేస్తుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై  ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంత వేధించిందో అందరికీ తెలుసునని, కానీ ఆ పార్టీలో చేరగానే షర్మిల మారిపోయారని విమర్శించారు. తెలంగాణలో ఆమె ఏం చేశారని ఏపీకి వస్తున్నారని వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వైయస్సార్ ఆశయాలకు కట్టుబడి పనిచేస్తున్న జగన్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారని సజ్జల పేర్కొన్నారు.


కేవీపీ, రఘువీరారెడ్డి తప్ప ఆమెకు కాంగ్రెస్ లో తెలిసిన వారు కూడా ఎవరూ లేరు. ఆమెకు తెలిసుంటే కాంగ్రెస్‌ పార్టీ ఆమె కుటుంబానికి ఎలా ద్రోహం చేసిందో తెలిసేది అన్నారు. వైఎస్సార్ మరణానంతరం  అక్రమ కేసులు బనాయించి నేరుగా వైఎస్సార్‌ పేరు చార్జ్‌షీట్‌లో పెట్టిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. జగన్‌ ని 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారని.. కాంగ్రెస్ నేత శంకర్రావు, టీడీపీ నుంచి ఎర్రంనాయుడు, అశోక్‌ గజపతి రాజులు కలిసి కుమ్మక్కై వేసిన కేసు చార్జ్‌షీట్లో వైఎస్సార్‌ పేరు పెట్టారు. సోనియా గాంధీ చెప్తేనే తాను కేసు వేశానని ఆనాడు శంకర్రావు కూడా చెప్పారని గుర్తు చేశారు.  


ఇన్నాళ్లూ తెలంగాణలో ఏం చేశావు..?
‘తెలంగాణలో పోటీ ఎందుకు చేయలేదు. అక్కడి ప్రజలకు ఏం సమాధానం చెప్పకుండానే పక్కకు ఎందుకు జరుగుతున్నారు? రేవంత్‌రెడ్డి...ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే.. తనకు హెల్ప్ అవుతారని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది. హోదా అంశాన్ని లేవనెత్తుతూ.. ఎప్పుడైతే ఆ అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని సాధించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగా ప్రధాని పక్కనే ఉన్నా విశాఖ సభలో జగన్‌ హోదా అంశాన్ని లేవనెత్తారు. మా ప్రభుత్వం రాగానే ఢిల్లీలో జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కూడా స్పష్టంగా చెప్పారు. అడ్డగోలుగా కాంగ్రెస్‌ ఈ రాష్ట్రాన్ని విభజించింది.. ఎందుకు ఏపీకి సరైన గ్యారెంటీలు కల్పించకుండా ఏకపక్షంగా విభజించారో షర్మిల, కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలని’ సజ్జల డిమాండ్ చేశారు.


2019లో అసలు పట్టించుకోని కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం ఇప్పుడు హఠాత్తుగా ఈమెను ఎందుకు పంపారు..?  ఓ వైపు బీజేపీ పొత్తు కోసం పురందేశ్వరి ప్రయత్నం చేస్తున్నారు... బీజేపీ పొత్తు ఉంది అని చెప్పుకుంటే లాభం అని భావిస్తున్నారని సజ్జల అన్నారు. ఆనాడు సోనియా గాంధీ వద్దకు వెళ్లిన ముగ్గురిలో ఈమె కూడా ఉన్నారని, ఆమె కఠినంగా బిహేవ్‌ చేశారని షర్మిలమ్మే చెప్పారని గుర్తుచేశారు. ఆమె వెనుక చంద్రబాబు ఉన్నారనేది రానున్న రోజుల్లో కనిపిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రోజూ టీడీపీ, జనసేన మాట్లాడేవే షర్మిల గారు కూడా మాట్లాడారు. అవే మాట్లాడితే లేని పార్టీకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.


షర్మిలను చరిత్ర కూడా క్షమించదు- మాజీ మంత్రి అనిల్ 
ఈరోజు మాట్లాడిన మాటలు వల్ల షర్మిలను చరిత్ర కూడా క్షమించదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరకాల శత్రువు అయిన చంద్రబాబు కోసం పనిచేయడం సబబేనా అని షర్మిలను ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రల్లో షర్మిల భాగస్వామి అవుతారు. అధికారం వస్తుంది, పోతుందని.. షర్మిల చేసిన తప్పులు చరిత్రలో మచ్చలుగా మిగిలిపోతాయని చెప్పారు. వైఎస్సార్ సీపీ ఓటు, వైఎస్సార్ అభిమానుల ఓట్లు చీల్చి ఎవరికీ లబ్ధి చేయాలని షర్మిల అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి టీడీపీ కోసం పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈరోజరు మీరు చేసే పొరపాటు వల్ల మాయని మచ్చగా మిగిలిపోతారుని.. వైఎస్సార్ ని అభిమానించే ప్రతి గుండె కూడా బాధపడతుంది అన్నారు.