Sajjala On Steel Plant : స్టీల్ ప్లాంట్ కోసం బిడ్డింగ్ దాఖలు చేయాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఈ అంశంపై సూటిగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సీరియస్ అంశంపై స్పందించే తీరా ఇది కాదని విపక్షాలకు సలహా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అందరి కంటే ఎక్కువగా స్పందించింది సీఎం వైఎస్ జగనే అని.. . తెలంగాణ మంత్రి కేటీఆర్ మాటల అర్ధం కూడా అదేనని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ను ఏ విధంగా రక్షించుకోవచ్చు అనే అంశం పై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారన్నారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని సీఎం కేంద్రాన్ని కోరారు.. స్టీల్ ప్లాంట్ కు ఉన్న ఏడు వేల ఎకరాల భూమిని తాకట్టు పెట్టి ఆర్ధికంగా ప్లాంట్ ను ఆదుకోవచ్చు అనే సలహా జగన్ .. మోదీకి ఇచ్చారన్నారు.
అసలు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటనలో ఏముందో కూడా చూడకుండా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలకు పైత్యం ఎక్కువైందన్న సజ్జల.. టీడీపీకి తోడు కమ్యూనిస్టులు కూడా కలిశారని విమర్శించారు. ఆర్టీసీని చంద్రబాబు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి ఆర్టీసీని జగన్.. ప్రభుత్వంలో విలీనం చేశారని సజ్జల గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ విసయంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. తమ ప్రభుత్వం ప్లాంట్ వయబులిటీని గురించి ఆలోచిస్తోందని సజ్జల తెలిపారు. చంద్రబాబుకు అధికారం కట్టబెట్లాలన్నది ఎల్లో మీడియా తాపత్రయమని ఆరోపించారు.
40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, ఆయన పార్టీ కూడా అసలు కేంద్ర ప్రకటనలో ఏముందో చూడరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల.. తెలంగాణ ప్రభుత్వం, ఇతర సంస్థలకు పాల్గొనే అవకాశం ఉందా అనేది గమనించరా? అని నిలదీసిన ఆయన.. పరిమితమైన కార్యకలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.. అయినా దిక్కు మాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేటైజేషన్ ఎ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు తన మనసులో మాట చెప్పారు.. ఈ పుస్తకంలో సంస్కరణ పేరుతో ఎన్ని ప్రభుత్వ సంస్థలను మూసేశాడో వివరించారని వ్యాఖ్యానించారు.
ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న కంపెనీల జాబితా కూడా సిద్ధం చేసి ఉంచాడన్న ఆయన.. అసలు కమ్యూనిస్టు పార్టీలకు ఏమైంది? అని మండిపడ్డారు.. వాళ్ళు కూడా అర్జెంటుగా చంద్రబాబును ఎందుకు అధికారంలోకి తీసుకుని రావాలి అనుకుటున్నారు? అని విమర్శించారు. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వపరం చేసిన నాయకుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. మొత్తంగా స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనడం సాధ్యం కాదని నేరుగా చెప్పకపోయినా... సజ్జల రామకృష్ణారెడ్డి అదే చెప్పారు.