Mylavaram YSRCP :  పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశం అయ్యారు. బుధవారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సజ్జలను కలిశారు. నియోజకవర్గంలో జోగి రమేష్ తన అనుచరులతో చేయిస్తున్న రాజకీయంపై ఫిర్యాదు చేశారు. పోటీ చేయమంటేనే చేస్తానని లేకపోతే పార్టీ కోసం పని చేస్తానని చెప్పి వచ్చానని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించారు. తర్వాతి రోజే సజ్జలను జోగి రమేష్ కలిశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి చేసుకుంటామని భేటీ తర్వాత జోగి రమేష్ వ్యాఖ్యానించారు. కృష్ణప్రసాద్‌తో కలిసి పని చేస్తామని.. సీఎం జగన్ ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే..అక్కడ పోటీ చేస్తానని జోగి రమేష్ మీడియాకు తెలిపారు. 


మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులే ఇంచార్జులుగా ఉన్నారు. అయితే వీరంతా నందిగామ నుంచి దిగుమతి అయినవారేనని జోగి రమేష్ వర్గీయులంటున్నారు.  అందరూ ఎమ్మెల్యే బామ్మర్ది కనుసన్నల్లో పనిచేస్తున్నారని..  ఈ ఇన్‌చార్జ్‌లు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని .. జోగి రమేష్ వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను..కూడా జోగి రమేష్ తన అనుచరులతో ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం కృష్ణ ప్రసాద్‌కు ఆహ్వానాలు అందడం లేదు. దీంతో వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తికి గురవుతున్నారు. 


2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ ఆ ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసారు. మాజీ మంత్రి దేవినేని ఉమా పైన గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి దేవినేని ఉమా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి జోగి రమేష్ పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జోగి రమష్ పెడన నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అయితే, మైలవరంలో జోగి రమేష్ మద్దతు వర్గం పార్టీలో పని చేస్తోంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నందున నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నానని కానీ నియోజకవర్గంలో పార్టీ చీలిపోతుందంటే తాను తప్పుకోవడానికి సిద్దమని ఎమ్మెల్యే చెబుతున్నారు.  


జోగి రమేష్  మనసు అంతా మైలవరం నుంచే ఉంది. ఆయన అనుచర వర్గం ఎక్కువగా మైలవరంలనే ఉంది. కానీ జగన్ ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాల రీత్యా.. పెడన నుంచి పోటీ చేయాలని సూచించారు. దానికి జోగిరమేష్ అంగీకరించారు. గెలిచారు కూడా. అయితే ఇటీవల జరగినస్థానిక ఎన్నికల్లో ఓ జడ్పీటీసీ స్థానంలో  టీడీపీ గెలిచింది. అందుకే తనకు అక్కడి కన్నా.. మైలవరమే సేఫ్ ప్లేసని..  జోగి రమేష్ గట్టిగా నమ్ముతున్నారు. ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. వసంత కృష్ణప్రసాద్ కన్నా ఎక్కువ నోరు ఉంది. అంతే కాకుండా చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లడం.. రఘురామరాజుపై తీవ్రంగా విరుచుకుపడటం వంటి చర్యల ద్వారా హైకమాండ్ మద్దతు పొందారు. అందుకే.. మైలవరం విషయంలో పార్టీ హైకమాండ్ ఆయన వైపే సానుకూలంగా ఉందని చెబుతున్నారు.  అందుకే టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తా లేదంటే లేదని వసంత కృష్ణప్రసాద్ అంటున్నారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.