తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో అనూహ్యంగా వైఎస్ఆర్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. తాము 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లుగా సిట్ అధికారులు తెలిపారు. నవంబరు 29న విచారణకు హాజరు కావాలని చెప్పినట్లుగా వివరించారు.


అయితే, ఈ అంశంపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. సిట్ తనకు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. మీడియాలో నోటీసులు అందాయని వస్తోందని, కానీ, తనకు ఎలాంటి నోటీసులు అందలేదని వివరించారు. తాను ఢిల్లీలో ఉన్నానని అన్నారు. హైదరాబాద్ ఇంటి వద్ద కూడా నిన్న సాయంత్రం వరకూ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. ఒకవేళ 41ఏ కింద నోటీసులు ఇస్తే ఏం చేయాలో కూడా తనకు తెలుసని అన్నారు. 


ఇప్పటికే వీరికి నోటీసులు - విచారణ


ఇప్పటికే ఈ కేసులో వీడియో ఫుటేజీలో వినిపించిన పేర్లను బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. వారితో పాటు సిట్ అధికారులు నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్‌పేట్‌కు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రతాప్ గౌడ్ దీన్ని కోర్టులో సవాలు చేయగా, ఈ కేసులో సిట్‌ విచారణకు హాజరుకావాలని న్యాయవాది ప్రతాప్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రతాప్‌ను అరెస్టు చేయొద్దని సిట్ అధికారులను ఆదేశించింది. నిందితుడు, అనుమానితుడు కానప్పటికీ 41ఏ నోటీసు ఇచ్చారని పిటిషనర్ తెలిపారు. కారణాలు ఉన్నందునే న్యాయవాది ప్రతాప్‌కు నోటీసు ఇచ్చినట్లు సిట్ అధికారులు చెప్పారు.


ప్రస్తుతం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ ప్రత్యేక బృందం బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఫామ్ హౌస్ లో ఆరోజు ఏం జరిగింది, అసలు ఎన్ని రోజుల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడుస్తుందన్న దానిపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అటు శ్రీనివాస్ ఇచ్చిన ఆధారాలతో టెక్నికల్, సైంటిఫికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. ఒకవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో శ్రీనివాస్ ఇచ్చిన ఆధారాలతో మరొకవైపు అదనపు టీమ్స్ ని ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు రామ చంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు డిలీటెడ్ డేటాను సేకరించే పనిలో పడ్డారు. వారి డేటాను బ్యాకప్ చేయించారని సమాచారం. అలాగే అటు లాప్ టాప్ లో ఉన్న కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఏకంగా లక్ష పేజీల ఉండే సమాచారం సిట్ బృందం సేకరించినట్లు తెలిసింది.   


ముఖ్యంగా 7075779637 నంబరుతో కూడిన శామ్ సంగ్ మొబైల్ ను రామచంద్రభారతి వినియోగించారు. ఆ ఫోన్లో 8762090655 వాట్సాప్ నంబరుతో విరివిగా చాటింగ్లు ఉన్నాయి. 9110662741 నంబరుతో కూడిన మరో ఫోన్ దొరికింది. ఫామ్ హౌస్ లో ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం వాటి నుంచి సమాచారం సేకరించడంతోపాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి విశ్లేషించారు. అప్పటికే తొలగించిన డేటాను రికవరీ చేశారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో సమాచారం లభ్యమైంది. ఆ ఫోన్ల నుంచి సునీల్ కుమార్ బన్సల్, బీఎల్ సంతోష్, తుషార్ వెళ్లాపల్లికి పంపిన మెసేజ్ లు ఉన్నాయి. నిందితుడు నందకుమార్ ఫోన్ లో వందల సంఖ్యలో చాటింగ్ లను గుర్తించారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే విషయంలో ఇద్దరి మధ్య సంభాషణలు ఉన్నాయి. భారతికి చెందిన డెల్ ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. వీటన్నింటినీ విశ్లేషించి పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించారు.