Sajjala On Gannavaram : గన్నవరం ఘటనలపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తనకున్న మీడియా బలంతో చంద్రబాబు అబద్దాలను నిజం చేయాలని చూస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చిన విషయాన్ని డైవర్షన్ చేసేందుకు ఈ గొడవ సృష్టించారని ఆరోపించారు. బీసీలను వంచించేందుకు అమలు చేయని హామీలు గుప్పిస్తూ మళ్లీ జనంలోకి వస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ పేరుతో రైతులను డ్వాక్రా రుణాలంటూ మహిళలను చంద్రబాబు మోసం చేశాడని ఆరోపించారు.
సీఎం జగన్ తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు భరోసాగా నిలిచారని చెప్పారు. మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావిస్తూ హామీలన్నీ నెరవేరుస్తున్నారని అన్నారు. బీసీలను మరోసారి వంచించేందుకు వస్తున్న చంద్రబాబును నమ్మవద్దని కోరారు. గ సీఎం జగన్ పారదర్శక పాలనతో ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. బీసీలంటే బ్యాక్‌బోన్ క్యాస్ట్స్‌గా తమ పార్టీ భావిస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో జగన్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని జాబితాను పరిశీలిస్తే తెలుస్తుందని అన్నారు. వార్డు సభ్యుల నుంచి ఎంపీల వరకూ పెద్దసంఖ్యలో బీసీలకు పదవులు ఇచ్చి గౌరవించారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది బీసీలకు పలు పదవులు దక్కాయని గుర్తుచేశారు. పిల్లలకు కార్పొరేట్ చదువులు దక్కేలా అట్టడుగు స్ధాయికి సంస్కరణలను తీసుకువెళ్లారని వివరించారు.
తన పదవిని బాధ్యతగా తీసుకుని.. ఇచ్చిన హామీలను జగన్ అమలు చేస్తున్నారు. ఎన్నికల రాబోతున్నాయని చంద్రబాబు పగటి వేషగాడిలాగా మళ్లీ వస్తున్నారు. జగన్ అంటే అందరిలాగా మాటలు చెప్పి వెళ్లిపోయే వ్యక్తి కాదు. ఆయన సంస్కరణలు అట్టడుగు వర్గాలకు సైతం అందాయి. పిల్లలకు కార్పొరేట్ చదువులు చదివేలా చర్యలు చేపట్టారాయన. ఏ నెలలో ఏ పథకం ఇవ్వబోతున్నారో కూడా జనానికి తెలుసంటే.. పాలన ఎంత పారదర్శకంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు అని సజ్జల పేర్కొన్నారు.
గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి.. ఆపార్టీ నేతల వాహనాలను తగులబెట్టి.. చివరికి ఆ పార్టీ నేతలపైనా హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపడంపై తీవ్ర విమర్శలు వస్తూండటంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా స్పందించారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని తిప్పి కొట్టారు. సీసీ ఫుటేజీలో మొత్తం కనిపిస్తున్నప్పటికీ.. సజ్జల రామకృష్ణారెడ్డి అదంతా దుష్ప్రచారం అని తేలికగా తీసుకున్నారు.