Roosters Are Being Fed Viagra And Shilajit: సంక్రాంతి వస్తోందంటే కోస్తా జిల్లాల్లో సందడి నెలకొంటుంది. పండుగ మూడు రోజులే అయినా నెలంతా ఆ సందడి కొనసాగుతుంది. కోడి పందేలు, కొత్త అల్లులు, కొత్త పంటలు ఇలా ప్రజలు సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ జరిగే మూడు రోజులు ఎక్కడ చూసిన కోడిపందాలు జరుగుతూనే ఉంటాయి. వాటి కోసం నెల రోజుల ముందు నుంచే బరులు గీసి పుంజులను సిద్ధం చేస్తారు. అయితే ఈసారి పందెం కోళ్లకు తెగుళ్లు సోకాయి. పందెం పుంజులకు దెరాణిఖెత్ అనే వైరల్ వ్యాధి సోకి వాటిని బలహీనపరిచింది. సంక్రాంతి సీజన్‌లో కోళ్లు తెగుళ్ల బారిన పడడంతో పెంపకందారుల్లో ఆందోళన నెలకొంది. కోళ్లన్నీ బలహీనంగా మారిపోతున్నాయి. బరిలో ఉండే కోళ్లు బలంగా ఉండాలి. ప్రత్యర్థి కోడిపై దాడి చేసేంత దృఢంగా ఉండాలి. అలాంటప్పుడే పందేలు జోరుగా సాగుతాయి. అయితే తెగుళ్ల కారణంగా కోళ్లు పోటీలకు పనికిరాకుండా పోతున్నాయి. రాణిఖెత్ వ్యాధి కారణంగా పుంజులు గణనీయంగా ప్రభావితమవుతున్నాయి. ఈ వ్యాధి సోకితే కోళ్లు బరిలో నిలవలేవు.  


కోళ్లకు అలాంటి ఆహారం


అలాంటి కోళ్లలో వేగంగా శక్తి పెంచడానికి పెంపకందారులు సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు. వయాగ్రా, షిలాజిత్, విటమిన్ల కాక్టెయిల్‌తో కూడిన ఆహారం అందిస్తూ వాటిని బలంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపై పశువైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పదార్ధాలు కోళ్లలో తాత్కాలికంగా పనితీరును మెరుగుపరుస్తాయని, కానీ భవిష్యత్తులో కోళ్లకు హాని తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కోళ్లను మనుషులు తింటే వారి ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. 


అందు కోసమే


కోళ్ల పరిస్థితిపై ఓ పెంపకందారుడు స్పందిస్తూ పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను వెల్లడించాడు. సంక్రాంతి సంబరాలకు కోళ్లను సిద్ధం చేయాలని, కోళ్ల బరువు, చురుకుదనంతోనే పందేలు ఆధారపడి ఉంటాయన్నారు. కోళ్లు బలహీనంగా ఉంటే ఎవరూ కొనుగోలు చేయరని, పందేలకు పనికి రావనే ఆలోచన వారిలో ఉంటుందన్నారు. ఏళ్ల తరబడి లక్షలు ఖర్చు చేసి పెంచిన కోళ్లు అమ్ముడవకపోతే కోట్లలో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సంక్రాంతి బరిలో అయినా కోళ్లను బలంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.


రూ.వందల కోట్లలో


కోడిపందేలు సంక్రాంతి సంబరాల్లో అంతర్భాగం. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పోటీలు ఎక్కువగా జరుగుతాయి. జనవరి 14, 15, 16 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో బరులు పుట్టుకొస్తున్నాయి. శిక్షణ పొందిన పుంజులు బరిలో దిగుతాయి. వందల కోట్లలో పందేలు జరుగుతాయి. ఒకే రోజులో లక్షాధికారి అయిన వారు ఉన్నారు. పొలం, ఆస్తులు, ఇల్లు, అన్నీ కోల్పోయిన వారూ ఉన్నారు. అయితే, పోలీసులు కోడిపందేలు నిర్వహించడం నేరమని, చట్టరీత్యా చర్యలు చేపడతామని చెబుతున్నా.. ఏటా ఈ తంతు మాత్రం కొనసాగుతూనే వస్తోంది.