ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేతకు రాజకీయ, సినీ, వ్యాపారం, ఇతర రంగాల ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తెలంగాణ సీఎం విషెష్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఏపీ అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
 

వైఎస్ జగన్ విషెష్..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు.
 
నాకు ఆదర్శం ఆయనే.. నారా లోకేష్ఏపీ మంత్రి నారా లోకేష్ తన తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలిపారు. తనకు ఆదర్శప్రాయమని, లెజెండ్ సీబీఎన్ అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కొందరు విత్తనాన్ని చూస్తారు, మరికొందరు మొక్కను చూస్తారు. కొందరు మాత్రమే భవిష్యత్తులో విస్తరించబోయే మహావృక్షాన్ని చూస్తారు. ఆయన ముందుచూపు ఎందరినో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భావితరాల భద్రత, జీవితాలకు ఆయన విజన్ బాటలు వేస్తుందని’ నారా లోకేష్ ఓ వీడియో పోస్ట్ చేశారు.

అనితర సాధ్యుడు చంద్రబాబు- పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెష్ తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం చంద్రబాబు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమన్నారు. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. నాలుగో పర్యాయం సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని కొనియాడారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన చంద్రబాబుకు సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.