AP As YSR Pradesh :  ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లపై జరుగుతున్న రగడపై  సీబీఐ మాజీ డైరక్టర్ మన్నెం నాగేశ్వరరావు ట్విట్టర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.   ఆంధ్రప్రదేశ్ పేరును వైఎస్ఆర్ ప్రదేశ్‌గా మార్చేస్తే ఎలాంటి సమస్యా ఉండదని  ఏపీ సీఎం జగన్‌కు సలహా ఇచ్చారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఆందోళనలు విస్తృతంమైన తరుణంలో ఆయన ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి “YSR Land” అనే ఇంగ్లీషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుందని కూడా చెప్పారు. 



తెలుగువ్యక్తి అయిన మన్నెం నాగేశ్వరరావు ఒరిస్సా క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన కేంద్ర సర్వీసుల్లో కొన్ని హఠాత్ పరిణామాల మధ్య సీబీఐ డైరక్టర్ అయ్యాడు. అవమానకరంగా బదిలీ అయ్యాడు . తర్వాత రిటైరయ్యారు. ఇప్పుడు ఆయన ట్విట్టర్‌లో హిందూత్వ వాదం వినిపిస్తూ వివాదాస్పద అంశాలపై ట్వీట్లు చేస్తున్నారు. కోనసీమ ఘర్షణల అంశం కలకలం రేపడంతో జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా వచ్చింది. అందుకే ఈ అంశంపై స్పందించినట్లుగా తెలుసతోంది.  జిల్లాలకు పేర్లు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. 





ఇటీవల ట్విట్టర్‌పై కోర్టుకెళ్లి మన్నెం నాగేశ్వరరావు చీవాట్లు తిన్నారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూండటంతో.. వెరీఫైడ్ అకౌంట్ హోదాను ట్విట్టర్ తొలగిచింది. బ్లూటిక్ తీసేయడంతో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓ సారి ఉత్తర్వులు ఇచ్చినా మళ్లీ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు జరిమానా విధించింది.