Rebel MLAs from TDP and YCP were absent from the Speaker hearing : ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల ‘అనర్హత’పై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లు ‘తుది’ నోటీసులు అందుకున్న ఆయా సభ్యులు ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాము విచారణకు హాజరు కాలేమని ఎమ్మెల్యేలు సమాచారం పంపారు. తమ అనర్హత పిటిషన్‌కు సంబంధించి.. పిటిషనర్ సమర్పించిన వీడియో ఆధారాలు ఒరిజినల్ అని నిరూపించాలని కోరారు. తాము మాట్లాడిన వీడియోలకు సంబంధించి ఆయా సంస్థల సర్టిఫైడ్ కాపీలు కావాలని స్పీకర్‌ను ఆనం కోరారు. మేకపాటి, శ్రీదేవి కూడా మరింత సమయం కావాలని కోరారు.
వైసీపీ, టీడీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు ఉండగా.. అలాగే మండలిలోనూ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణలు ఉండగా.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ లపై కూడా తెలుగుదేశం పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.
మ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్న తర్వాతే.. వాళ్లపై నమోదు అయిన అనర్హత పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. స్పీకర్, మండలి చైర్మన్‌లు ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ నోటీసులు పంపిస్తూ వచ్చారు. అయితే వీళ్లలో కొందరు అరకోరగా విచారణకు హాజరయ్యారు. మూడుసార్లు నోటీసులు ఇస్తే.. రకరకాల కారణాలతో వాళ్లు విచారణకు గైర్హాజరు అవుతూ వస్తున్నారు.
అలాగే.. అనర్హత పిటిషన్లు వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు, మేరిగ మురళీధర్ సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం.ఒకవేళ.. హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ ఇదివరకే నోటీసుల్లో స్పీకర్, చైర్మన్‌లు స్పష్టం చేశారు. ఇప్పుడు న్యాయసలహా తీసుకుని స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం ప్రకటించనున్నారు. నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ జరుగుతుందేమో అన్న సందేహంతో ... వైసీపీ చరుకుగా పావులు కదిపి ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుందని అనుకున్నారు. అయితే టీడీపీ రాజ్యసభ అభ్యర్థిని పెట్టలేదు. దీంతో ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రత్యేకమైన ప్రభావం ఉండదు. వచ్చే నెల పదో తేదీ కల్లా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా కోల్పోయే పదవీ కాలం కూడా ఏమీ ఉండదని అంచనా వేస్తున్నారు.