Mla Rapaka : ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగిన నాటి మాటలను ఓ కార్యక్రమంలో చెప్పితే దాన్ని వక్రీకరించారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎస్సీల్లో ఎక్కువ శాతం వైసీపీకు పనిచేశారని, చింతలపల్లిలో ఆత్మీయ సమావేశం పెట్టడం వెనుక కారణం బంతు రాజేశ్వరరావు జనసేనకు వెళ్లడం వల్ల అక్కడి వారంతా నావెంటే ఉంటామని చెప్పడంతోనేనన్నారు. అదికూడా వాళ్లు వేయించానని చెప్పిన విషయాన్ని ఆ సభలో నవ్వుకోవడానికే చెప్పాను కానీ తాను దొంగ ఓట్లతో నెగ్గానని తాను అనలేదని చెప్పుకొచ్చారు. నేను సమావేశంలో పాల్గొన్న ప్రాంతంలోని ఎస్సీలు 2019లో నాకు కోసం పని చేయలేదని, నాకు జనసైనికులు పనిచేసి గెలిపించారని తెలిపారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, రాజోలు నియోజకవర్గంలోనే గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని, ఆ ఫోన్ తరువాత సైలెంట్‌లో పెట్టి రెస్ట్ తీసుకున్నానని, అయితే ఈలోపు అజ్ఞాతంలో రాపాక అంటూ ప్రచారం జరిగిందన్నారు. ఫిబ్రవరి 28న రాజోలు నియోజకవర్గం చింతలపల్లిలో ఎమ్మెల్యే రాపాక ఆత్మీయ సమావేశంలో దొంగ ఓట్లుతో గెలిచానని చెప్పిన మాటలు సోషల్ మీడియాతోపాటు అన్ని మీడియా సంస్థల్లో హల్‌చల్ చేయడంతో ఆయన వివరణ ఇచ్చారు.
రాజేశ్వరరావు చేతకాని వాడు
రాష్ట్రంలో వైసీపీ గాలితో 151 సీట్లు గెలిస్తే రాజోలులో మాత్రం బంతు రాజేశ్వరరావు ఓడిపోయాడని, ఆయన చేతకానివాడు కాబట్టే వైసీపీకి పట్టున్న నియోజకవర్గంలో ఓడిపోయాడన్నారు రాపాక. ఆయన పేటలో ఉన్నా ఒకటే కోటలో ఉన్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. నీ కార్యకర్తలకు నీమీద నమ్మకం లేదు గనుకే 2019లో ఓడిపోయావని, తన గురించి మాట్లాడే స్థాయి రాజేశ్వరరావుకు లేదన్నారు.
జనసైనికుల ఓట్లతోనే గెలిచాను
2019 ఎన్నికల్లో తాను గెలిచింది జనసైనికుల మేజర్ ఓట్ల వల్లే గెలిచానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. జనసేన కార్యకర్తలు నాపై ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, ఏమైనా అవసరముంటే టీడీపీకు ఉందని, ఎందుకంటే తనను టీడీపీ వాళ్లే ఓటు వేయాలని కోరారని చెప్పినందుకు అన్నారు.
"ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన వాటిని చెప్పాను. ఇప్పుడు దొంగఓట్లు వేశానని చెప్పాలేదు. నా మాటలు వక్రీకరించారు. ఎస్సీల్లో ఎక్కువ మంది వైసీపీకి ఓటు వేశారు. గతంలో వీళ్లు బొంతు రాజేశ్వరరావు వెంట ఉన్నారు. ఇప్పుడు ఆయన జనసేనకు వెళ్లారు. కాబట్టి వాళ్లంతా ఇప్పుడు మీ వెంట ఉంటామని నాకు హామీ ఇచ్చారు. అందుకే అక్కడే ఆత్మీయ సమ్మేళనం పెట్టాం. అందరు నువ్వుకుంటారని ఆ మాటలు అన్నారు. జనసైనికులు కూడా ఆందోళన చేయాల్సిన అవసరంలేదు. టీడీపీ వాళ్లు వచ్చి వాళ్లకు మద్దతుగా ఓటు వెళ్లమన్నారు. రాజేశ్వరరావు చేతకాని వాడు. వైసీపీ గాలి వీస్తున్న సమయంలో బంతు రాజేశ్వరరావు ఓడిపోయాడు. వైసీపీ పట్టున్న నియోజకవర్గంలో రాజేశ్వరరావు ఓడిపోయాడు. ఆ రోజు జనసైనికులు నా వెంట ఉన్నారు కాబట్టి గెలిచాను."- ఎమ్మెల్యే రాపాక
వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనంలో రాపాక ఏమన్నారంటే?
రాజోలు ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాదరావు ఆ సమ్మేళనంలో మాట్లాడుతూ.. పూర్వం నుంచి తమ గ్రామం చింతలమోరికి ఓ బ్యాచ్ దొంగ ఓట్లు వేయడానికి వచ్చేవారని చెప్పారు. ఆ ఓట్లతో తన విజయానికి వారు సహకరించేవారని బహిరంగంగా చెప్పారు. 15 నుంచి 20 మంది వచ్చి, ఒక్కొక్కరూ 5 నుంచి 10కి పైగా ఓట్లు వేసేవారని ఆయన చెప్పడం విస్మయం కలిగించింది. దీంతో తనకు 800 పైనే మెజారిటీ వచ్చిందని వివరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.