ఆంధ్రప్రదేశ్‌లో మరో విభజన ఉద్యమం ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. దానికి ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమయ్యే అవకాశం ఉంది. కృష్ణా బోర్డును కేంద్రం నోటిఫై చేయడం.. ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో.. ప్రధానంగా నష్టపోయేది రాయలసీమేనని నిపుణులు ఇప్పటికే తేల్చారు. దీంతో.. గ్రేటర్ రాయలసీమ కోసం ఇది వేరకే వేదిక ప్రారంభించిన మైసూరారెడ్డి .. మరోసారి తెరపైకి వచ్చారు. గ్రేటర్ సీమకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఉండి ఉంటే.. ఈ పరిస్థితి ఉండేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కృష్ణా నీళ్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరును ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుని రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన అంటున్నారు. అసలు ఏపీలో సీమ  అంతర్భాగమా కాదో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.  కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ను జగన్‌ను స్వాగతించడాన్ని ఆయన తప్పు పట్టారు. రాయలసీమను జగన్ చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పార్టీలకు అతీతంగా రాయలసీమకు చెందిన రాజకీయ నేతలు ఒక్కతాటిపైకి వచ్చి .. తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తితే .. యువత అంతా కదిలే అవకాశం ఉంది. మైసూరారెడ్డి ఎప్పుడో గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చినప్పుడు.. గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాశారు. గతంలో..  కలిసి ఉండాలన్న కారణంగా.. కర్నూలు రాజధానిని త్యాగం చేశామని.. త్యాగాలను గుర్తించి ఇప్పటికైనా.. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని.. పార్టీలకు అతీతంగా సీనియర్‌ నేతలంతా జగన్‌కు లేఖ రాశారు. రాయలసీమ నాలుగు జిల్లాలు మాత్రమే కాకుండా.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని ఈ నేతలు.. గ్రేటర్ రాయలసీమగా వారు పేర్కొంటున్నారు.


గ్రేటర్ సీమ కోసం ఉద్యమించాలని  భావిస్తున్న వారిలో  గంగుల ప్రతాప్‌రెడ్డి, మైసూరారెడ్డి,  రెడ్డివారి చెంగారెడ్డి, మాజీ డీజీపీలు ఆంజనేయరెడ్డి, దినేష్‌రెడ్డి లాంటి వారు ఉన్నారు.   తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో  తాము ముందుకెళ్తామని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు. ఆయన పుస్తకాలు కూడా రాస్తున్నారు. "జై గ్రేటర్ రాయలసీమ" పుస్తకం రాసి విడుదల చేశారు. సీనియర్ నేతలంతా అప్పుడప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియా మీట్లు పెడుతున్నారు. కానీ ఎప్పుడూ క్షేత్ర స్థాయిలో ఏదైనా కార్యక్రమాలు పెట్టే ప్రయత్నం చేయడం లేదు. దీంతో.. రాజకీయంగా ప్రాధాన్యత దక్కని నేతలు.. చేస్తున్న ప్రయత్నాలుగా మిగిలిపోతున్నాయి. గతంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా పెద్ద పార్టీ పెట్టి పెద్ద ఎత్తున తిరిగారు. కానీ ప్రజల స్పందన లేకపోవడంతో లైట్ తీసుకున్నారు.  


అయితే ఇప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్న వాదన తెరపైకి వస్తోంది.  నీటిపై ప్రభుత్వం హక్కులను వదులుకోవడం అంటే.. సీమను ఎండ బెట్టినట్లేనని చెబుతున్నారు. దీంతో యువతలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్ల ఆలోచనకు .. యువత ఆవేశం తోడైతే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం కాకపోయినా.. కనీసం రాయలసీమ ఉద్యమం అయినా ఊపందుకునే అవకాశం ఉంది. అయితే.. దీన్ని  ప్రారంభంలోనే అణిచివేయడానికి ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.