Minister Venugopala Krishna : అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం చింతపల్లి సూరన్న నగర్ మున్సిపల్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు 1078 ట్యాబ్ లు పంపిణీ చేశారు  మంత్రి  చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ. విద్య ద్వారానే సమాజంలో అంతరాలు తొలగిపోతాయని మంత్రి వేణు గోపాలకృష్ణ అన్నారు. పేదరికాన్ని జయించడానికి విద్య ఒక ఆయుధం అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధకుడు జగన్ అని తెలిపారు. విద్యా విప్లవకారుడు సీఎం జగన్ అన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే ముఖ్యమంత్రి జగన్ విద్యారంగంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేశారన్నారు. సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల కోసం నేడు బై జ్యూస్ కంటెంట్ ట్యాబ్ లను జగన్ పంపిణీ చేస్తున్నారన్నారు. ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో ఆర్డీఓ సింధూ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ ఛైర్ పర్సన్ గాధంసెట్టి  శ్రీదేవి, కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


విద్యే ఆయుధం 


"రామచంద్రాపురంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేశాం. విద్య మాత్రమే పేదరికాన్ని రూపుమాపుతుంది. కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే లభ్యమయ్యే బైజూస్ కంటెంట్ ట్యాబ్ లో పేదలకు అందిస్తున్నాం. విద్యా రంగ సంస్కరణల్లో  వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే సీఎం జగన్ నాలుగు అడుగులు వేశారు. సీఎం జగన్ దార్శినికుడు. విద్య ద్వారా సమాజంలో అంతరాలు నశిస్తాయని నమ్మినవ్యక్తి సీఎం జగన్. విద్యే ఒక ఆయుధం పేదరికాన్ని జయించడానికి అని అంబేడ్కర్ తెలిపారు. అంబేడ్కర్ ఆశయాన్ని సాధనలో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు." - మంత్రి వేణుగోపాల కృష్ణ  


 రూ.1466 కోట్ల విలువైన ట్యాబ్ లు పంపిణీ 


డిసెంబర్ 21న  బాపట్ల జిల్లా యడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో ముఖ్యమంత్రి జగన్..ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు రూ.32 వేల విలువైన ప్రీ అప్ లోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ రూ.1466 కోట్లు కాగా, టెండరింగ్ పద్దతి ద్వారా రూ.187 కోట్లను ఆదా చేసిందని విద్యాశాఖ చెబుతోంది.  పేద విద్యార్థులకు డిజిటల్ చదువులు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ కార్యక్రమంపై ప్రతిపక్షాల చేస్తున్న అవినీతి ఆరోపణలు తిప్పికొట్టింది. ట్యాబ్ ధర అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో రూ.14,500 ఉండగా.. టెండర్ ప్రక్రియ ద్వారా ఒక్కో ట్యాబ్ కు రూ.12,843 ధరకే కొనుగోలు చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది. ఈ కామర్స్ సంస్థ  అమెజాన్ ధర కంటే ఇది రూ3,603 (22%) తక్కువ. ట్యాబ్‌తో పాటు, ఫ్లిప్ కవర్, 64 జీబీ మెమరీ కార్డ్, ఓటీజీ కేబుల్ మూడేళ్ల వారంటీ కార్డ్‌తో సహా అనేక అదనపు వస్తువులను కూడా విద్యార్థులకు అందించినట్లు విద్యా శాఖ తెలిపింది. అంతేకాకుండా, మండల ప్రధాన కార్యాలయం వరకు రవాణా ఖర్చు కూడా ఈ ధరలోనే కలిపి ఉంటుందని తెలిపింది. ట్యాబ్ ల కొనుగోలు కోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియలో నాలుగు జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు పాల్గొన్నాయన్నారు.  టెండర్ అవార్డులో ఎటువంటి పక్షపాతం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.