YSRCP MLAS going to CM Camp Office: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చాలా మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం నో చెప్పింది. ఇప్పటికే తాడేపల్లికి చేరుకుని ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటుండగా ఇక ఏ ప్రయత్నాలు ఫలించవని తెలిసి ప్లాన్‌ బీ ప్రయత్నాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారట. ఇందులో ప్రధానంగా మాకు ఇవ్వకపోయినా మా కుటుంబంలో ఎవ్వరో ఒకరికి ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారట. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులకు వారు ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో పోటీకు టిక్కెట్లు ఇవ్వమని తేల్చిచెప్పిన తాడేపల్లి కార్యాలయం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మాత్రం రాజమండ్రి రూరల్‌ వెళ్లాలని ఆదేశించినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే మరో మంత్రి పినిపే విశ్వరూప్‌కు టిక్కెట్టు ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన పరిస్థితి ఉండడంతో మంత్రి విశ్వరూప్‌  సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వెనుతిరిగినట్లు తెలిసింది..


కుటుంబంలో ఎవరో ఒకరికి ఛాన్స్‌ ఇవ్వాలని విజ్ఞప్తి..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది సిట్టింగ్‌లకు నోఛాన్స్‌ అని తేల్చిచెప్పిన అధిష్టానం వారిని బుజ్జగించే పనిని ఉభయ గోదావరి జిల్లాల ఇంఛార్జ్, ఎంపీ మిథున్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిలకు అప్పగించినట్లు తెలిసింది. అయితే ముఖ్యమంత్రితో సమావేశమైన సిట్టింగ్‌లు వారికి జగన్‌ నుంచి సూటిగా లభించిన సమాధానంతో నిరాశ చెందకుండా ఉండేందుకు వారితో మిథున్‌రెడ్డి, సజ్జల సమావేశం అవుతుండగా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండడంతో అక్కడ  మాకు లేకపోయినా మా కుటుంబంలో ఎవ్వరో ఒకరికి ఇవ్వాలని మాత్రం కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రరావు కుటుంబంతో సీఎంను కలిసేందుకు వెళ్లారు.. ఇదిలా ఉంటే మంత్రి విశ్వరూప్‌ తన కుమారులిద్దరుతో కలిసి సీఎంను కలిసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది.


ఇక రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తన కుమారుడు సూర్యప్రకాశరావు పేరును ప్రతిపాదించగా ఆయనకే ఖరారు అయ్యింది. ఇదిలా ఉంటే పి.గన్నవరం స్థానానికి సంబంధించి మాలో ఎవరో ఒకరికి ఇవ్వాలని మంత్రి విశ్వరూప్‌, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కోరినట్లు తెలిసింది. అయితే ఈ స్థానం నుంచి విజయవాడ డీసీపీ మోకా సత్తిబాబు సతీమణి రమాదేవికి కేటాయించేందుకు ఎక్కువ శాతం అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. 


తెరమీదకు కొత్త పేర్లు..
ఇదిలా ఉంటే సిట్టింగ్‌ల పేర్లు గల్లంతవుతుండడంతో పార్టీలో సుదీర్ఘకాలంగా కష్టపడి కార్యకర్తలుగా పనిచేస్తున్న ఆశావాహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పి.గన్నవరం నుంచి అయినవిల్లి జడ్పీటీసీ సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, అమలాపురం నుంచి గుడ్‌సీడ్‌ ఫౌండేషన్‌ అధినేత, సామాజిక వేత్త కుంచే రమణారావు, అమలాపురం ఎంపీ చింతా అనురాధ భభర్త, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి టీఎస్‌ఎన్‌ మూర్తి ఇలా చాలా మంది ఎవ్వరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమలాపురం నియోజకవర్గం సీటు తమ నాయకునికే కేటాయించాలంటూ అమలాపురం నుంచి పది వాహనాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు, మంత్రి విశ్వరూప్‌ అనుచరులు తాడేపల్లి వెళ్లి ముఖ్యనాయకులుతో సమావేశం అయ్యారని తెలుస్తోంది.