YSRCP News: ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీ.. దానినే నమ్ముకున్న ముఖ్య నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు మరోలా కూడా నష్టపోయారని ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ గెలుస్తుందని, తమ అభ్యర్థులు నెగ్గుతారని విపరీతంగా బెట్టింగ్‌ల్లో పాల్గనడమేనట. రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అని తమ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు నెగ్గుతారని వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఇలా అనేక కోణాల్లో బెట్టింగ్‌లు వేశారు. ఈ పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువగా ఉందన్న ప్రచారం ఎక్కువగా ఉంది...
పంచమని ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయి..?
ఎన్నికల్లో డబ్బులు పాత్ర చాలా కీలకం కాగా వైసీపీ నాయకత్వం పంపించిన డబ్బులు గ్రామాల్లో చివరి వరకు చేరలేదని, ఈ డబ్బును చాలా మంది నొక్కేసారని ప్రచారం సాగుతోంది. మీరు సరిగ్గా పంచలేదంటే మీరు సరిగ్గా పంచలేదు. అయినకాడికి నొక్కేసారని ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారట. పథకాలు లబ్ధిపొందిన జనాలు ఎలాగూ ఓట్లేస్తారు.. ఇంక మనం పంచేదేంది..? అవసరమా అని చాలా మంది నాయకులు తమ జేబుల్లో పెట్టుకున్నారట. ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్లు ప్రజలకు పంచమని పంపిన డబ్బును పంచకుండా నొక్కేసారని సొంత పార్టీలోనే నాయకుల్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారట.
బెట్టింగ్‌ల్లో యమ స్పీడుగా...
మా పార్టీ గెలుస్తుంది.. మా నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.. అంటూ వైసీపీ నాయకులు ఈసారి చాలా పెద్దస్థాయిలో బెట్టింగ్‌లకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఇంతకీ ఇంత డబ్బు ధైర్యంగా ఎలా వేస్తున్నారని ఆరాతీసిన కొందరికి అసలు విషయం తెలిసి కొట్టేసిన సొమ్మేకదా... వస్తే డబుల్ వస్తుంది. లేకపోతే పోతుంది అన్న ధీమాతో మరీ బెట్టింగ్‌లు పెట్టి పోగొట్టుకున్నారట. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది..
అన్నిచోట్ల కూటమికి బంపర్ మెజార్టీ..
పలానా మండలంలో మాకు మెజార్టీ వస్తుంది.. ఆ గ్రామం మాదే.. అక్కడ మెజార్టీ రెట్టింపు వస్తుంది.. ఇలా ఎవరికి వారు వైసీపీ అభ్యర్ధులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.. తీరా ఫలితాల్లో తారుమారు అవ్వడంతో అవాక్కయిన పరిస్థితి కనిపించిందట.. ముఖ్యంగా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో, వార్డుల్లోనూ వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.. బూత్‌ల వారీగా మెజార్టీలను తెప్పించుకొని చూసి ఓటమి చెందిన వైసీపీ అభ్యర్థులు ఇదేం దారుణంరా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారట.. మనకు పట్టున్న ప్రాంతంలో, పైగా మన నాయకులు ఎక్కువగా ఉన్న చోట కూటమికే ఇంత ఎక్కువగా మెజార్టీ రావడం ఏంటని, దీనికి ఒక కారణం మన నాయకులే అని పోస్ట్‌మార్టం చేసుకుంటున్నారట..
కొంప ముంచిన ఎగ్జిట్ పోల్స్..
ఈ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం గెలువబోతుంది.. మళ్లీ ముఖ్యమంత్రి జగన్ అవుతారని కొన్ని ఎగ్జిట్‌పోల్ ఫలితాలు ఊదరగొట్టడంతో దానిని నమ్మిన వైసీపీ నాయకులు భారీ ఎత్తులో బెట్టింగ్స్‌లో పాల్గని చాలా నష్టపోయారట.. ముందు కొంచెం తక్కువ స్థాయిలో బెట్టింగ్‌లకు పాల్పడినా ఆఖరి వారం రోజుల్లో వైసీపీ గెలుస్తుందని భారీ స్థాయిలో బెట్టింగ్‌లు కాయడంతో పార్టీ అధికారంలోకి రాక బెట్టింగ్‌ల రూపంలో లక్షల రూపాయలు పోగొట్టుకుని దిగాలు పడ్డారట..