Pithapuram ex mla Varma Attacked | పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి సభ్యత, సంస్కారం ఉన్న వ్యక్తితో కలిసి పని చేసినందుకు తనకు గర్వంగా ఉందన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఆయనతో ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. శుక్రవారం (జూన్ 7న) గొల్లప్రోలు మండలం, వన్నెపూడి గ్రామంలో టీడీపీ నేత వర్మ కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటనపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. ఐదారు నెలల కింద టీడీపీ నుంచి వెళ్లిపోయి జనసేనలో చేరిన వారు తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మనుషులే ఈ కార్యకర్తలు అని వర్మ ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఎంపీ విజయం కోసం తాము శ్రమించినా, ఈ దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని, ఎదురుదాడి చేయడానికి చేతకాక కాదని, తాము సంయమనం పాటిస్తున్నట్లు వర్మ చెప్పారు. 


పిఠాపురంలో తొలిసారి ఇలాంటి దాడులు.. 
‘సీసాలు, ఇటుకలతో దాడులు చేశారు. ఇటీవల ఇలాంటి దాడులు సర్వసాధారణం అయ్యాయి. నటుడు సాయిధరమ్ తేజ్ పై సైతం ఇలాగే కొన్ని రోజుల కింద దాడికి పాల్పడ్డారు. నన్ను హత్య చేయడానికి ఈ దాడి చేశారు. సీసా పెంకులు గుచ్చుకున్నాయి. 20 ఏళ్లకు పైగా తాను రాజకీయాల్లో ఉండగా.. ఇప్పుడు తొలిసారి పిఠాపురంలో ఇలాంటి దాడి జరిగింది. తనపై దాడి చేసింది అసలైన జనసేన కార్యకర్తలు కాదు. వారి వ్యవహారం నచ్చక టీడీపీ నుంచి తీసేసిన 25 మంది జనసేనలో చేరారు. వీళ్లు మా కార్యకర్తలపై దాడులు చేశారు. ఇప్పుడు ఏకంగా నాపై దాడికి పాల్పడ్డారు’ అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పుకొచ్చారు.


అధిష్టానం సూచన మేరకు ఫిర్యాదులు చేయలేదు 
‘నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు. పార్టీ అధినాయకత్వం సూచన మేరకు ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గత 8 నెలలుగా ఓ టీడీపీ నేత నాపై దాడులకు ప్లాన్ చేశారు. పార్టీలో వారి వ్యవహారం నచ్చకపోవడంతోనే దాదాపు 25 మంది కార్యకర్తలను టీడీపీ నుంచి బయటకు పంపించాం. కానీ వారు వెళ్లి జనసేనలో చేరారు. వారే ఇప్పుడు నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే వీళ్లు ఇతర జనసేన కార్యకర్తల్లా పార్టీ కోసం పనిచేసే వారు కాదు. వారి ఉద్దేశం వేరే ఉంది. వెనుక ఉండి మాకు సహాయం చేసిన వాళ్లు ఉన్నారు. వెనుక నుంచి మాపై దాడులకు పాల్పడిన వారు ఉన్నారు. దాడి జరిగిన సమయంలో వాహనంలో మాజీ జెడ్పీటీసీలు, ముఖ్యనేతలు ఉన్న సమయంలో దుండగులు దాడి చేశారు.


సాయిధరమ్ తేజ్ పై దాడి జరిగిన సమయంలో మేం వెళ్లిపోయాక దాడి జరిగిందని పోలీసులు చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ తాజా ఘటనకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఏ సంబంధం లేదు. నా వాహనాన్ని రిపేర్ చేయించకుండా అలాగే బయట పెడతాను. పోలీసులు సరైన చర్యలు తీసుకునే వరకు లాక్ చేసి కారును సెంటర్లోనే పెడతాను. 2009 నుంచి పవన్ కళ్యాణ్, ఆయనకు సంబంధించిన వ్యక్తులకు మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు.


ఎన్ని కుక్కలు మొరిగినా నేను భయపడను. ఎన్ని దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ ఇది ఉద్దేశ పూర్వకంగా, నన్ను హత్య చేసేందుకు జరిగిన దాడి అని’ మాజీ ఎమ్మెల్యే వర్మ వివరించారు. మొదట జనసేన కార్యకర్తలు వర్మపై దాడి చేశారని ప్రచారం జరగడంతో పిఠాపురం నియోజకవర్గం ఉలిక్కిపడింది. వర్మ స్పందించాక దీనిపై స్థానికులకు క్లారిటీ వచ్చింది.