YSRCP MP Raghurama Krishna Raju: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  కార్యకమాలు ప్లాన్ చేసింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో తనను అరెస్ట్ చేస్తే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు హెచ్చరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. తనను అల్లూరి విగ్రహావిష్కరణ సభకు రాకుండా చూడాలని కొందరు నేతలు సీఎంను కోరినట్లు తనకు తెలిసిందని కీలక వ్యాఖ్యలు చేశారు.


అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ.. 
అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఆజాద్ కా అమృత్ ఉత్సవాలలో భాగంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి తాను కచ్చితంగా హాజరవుతానని వైఎస్సార్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామ ఇదివరకే తెలిపారు. తాను ప్రధాని ఈవెంట్‌కు హాజరైతే.. ఆ సభలో పోలీసులు తనను అరెస్ట్ చేయడం లాంటి పిచ్చి చేష్టలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఎంపీ రఘురామ హెచ్చరించారు. ‘నా దారిలో నేను వస్తా... నా దారిలో నేను వెళ్ళిపోతాను. ప్రభుత్వ పెద్దలు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే, ప్రధాని మోదీ సమక్షంలోనే నా ప్రాణ రక్షణ గురించి అభ్యర్థించాల్సి ఉంటుంది. భీమవరంలో జరిగే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం పార్టీ కార్యక్రమం కాదు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సీఎంగానే ఈ సభకు హాజరు కావాల్సి ఉంటుంది. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తనకు ప్రభుత్వం, పోలీసుల నుంచి  ఉన్న హానిని గుర్తించి ప్రతిపక్ష పార్టీల నాయకులు, తమ పార్టీలో అల్లూరి స్ఫూర్తితో పని చేసేవారు రక్షణ కవచంగా నిలబడాలని’ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కోరారు. 


రెండున్నరేళ్ల తరువాత నియోజకవర్గానికి..
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు మంగళవారం మాట్లాడుతూ... ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపిస్తున్న తనకు, దుష్ట చతుష్టయం నుంచి పొంచి ఉన్న ఆపదను గుర్తించి అన్ని వర్గాల వారు అండగా నిలవాలన్నారు. రెండున్నర ఏళ్ల తర్వాత నియోజకవర్గానికి వస్తున్న తనని చూడడానికి తన అభిమానులు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే సీఎం జగన్ వచ్చినా, రాకపోయినా తాను మాత్రం సభకు హాజరవుతానని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను చూసి సభల నుంచి పారిపోయే జనం ప్రధాని మోదీని చూసేందుకు తరలి వస్తారని అభిప్రాయపడ్డారు.సభకు డ్వాక్రా మహిళలను తరలించేందుకు అధికారులు ఆపసోపాలు పడొద్దని, ఈ సభకు స్వచ్ఛందంగానే ప్రజలు హాజరవుతారని అన్నారు.


Also Read: EPF Money Debited: ఏపీలో ఉద్యోగులకు మరో షాక్ - పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం


Also Read: YSRCP Nominated Posts: వైఎస్సార్‌సీపీలో పదవుల పండుగ - పార్టీ అనుబంధ సంఘాల‌కు అధ్యక్షులు వీరే