చింతామణి నాటకాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆర్యవైశ్యులకు వ్యతిరేకంగా కాదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వివరమ ఇచ్చారు.  కళాకారులను దృష్టిలో పెట్టుకొని వారు జీవించే హక్కును కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదని పిటిషన్ దాఖలు చేశాననని తెలిపారు.  ఆర్య వైశ్యులు మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సుబ్బిశెట్టి పాత్ర తీసివేసి లేదా పాత్ర పేరు మార్చాలి అనేది తన వాదన అని స్పష్టం చేశారు.  కంట్లో నలుసు పడితే కన్ను తీసివేయుము అలాగే నాటికలో ఒక పాత్ర నచ్చకపోతే  నాటికను రద్దు చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. 


చింతామణి నాటకం రద్దుపై హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారంటూ ఆయనకు వ్యతిరేకంగా కొన్ని ఆర్యవైశ్య సంఘాలు నిరసనలు..దిష్టిబొమ్మలు తగులబెట్టాలని పిలుపునిచ్చాయి. ఈ కారణంగా రఘురామ పిటిషన్ వేయడంపై తన ఉద్దేశాన్ని వివరించారు.  చింతామణి నాటిక లో సుబ్బిశెట్టి పాత్ర కు కులం పేరు లేకుండా వైశ్యులకు సంబంధం లేకుండా మార్చుదామని.. సుబ్బిశెట్టి పాత్రకు తన పేరు పెట్టిన నాకు అభ్యంతరం లేదని ప్రకటించారు. కొందరు ఆర్యవైశ్య ప్రముఖులను సంప్రదించి వారి సమ్మతితోనే చింతామణి నాటిక రద్దు పైన నేను కోర్టులో పిటిషన్ వేశానన్నారు. 


చింతామణి నాటకం పై నేను వేసిన పిటిషన్‌ను ఆందోళనలకు పిలుపునిచ్చిన వారు ఒకసారి పరిశీలించాలన్నారు. చింతామణి నాటికపై నాతో పాటు మరొకరు కూడా పిటిషన్ వేశారు.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే నా ఒక్కడి దిష్టిబొమ్మలు దగ్ధం చేయటానికి పిలుపునిచ్చారని ఆరోపించారు. ఎవరి మనోభావాలు దెబ్బ తీయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ తాను చేసింది బాధ అని భావిస్తే నా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాకు అభ్యంతరం లేదని  ప్రకటించారు. 


ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తాను కొట్టినప్పుడు నోరు మెదపని అధికార పార్టీ ఆర్యవైశ్య ప్రముఖులు ఇప్పుడు  సీఎం ప్రోద్బలంతో రాజకీయ దురుద్దేశంతో నాపైన ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారని రఘురామ ఆరోపించారు. సుబ్బారావు గుప్తా మానసిక ఆవేదన పట్టించుకోకుండా పిచ్చివాడిగా ముద్రవేశారన్నారు. ఆర్య వైశ్యులు అంటే తనకు ఎనలేని గౌరవ అభిమానాలు  ఉన్నాయన్నారు. సమాజంలో సేవా కార్యక్రమాలకు ఆర్యవైశ్య ముందుంటారని.. అలాంటి  ఆర్య వైశ్య జాతి లో వైషమ్యాలను రెచ్చగొట్టేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని పసిగట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్‌సీపీ తరపునే విజయం సాధించిన రఘురామ తర్వాత ప్రభుత్వ  విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీకి చెందిన వారే ఆయనకు వ్యతిరేకగా కేసులు పెడుతున్నారు.. నిరసనలకు పిలుపునిస్తున్నారు.