Yanamala Rama Krishnudu: తుని: గత ఐదేళ్లు వైసీపీ విధ్వంసకర పాలన సాగించిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఐదేళ్లలో ప్రజలు, రాజకీయ పార్టీలు, సంస్థలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రభుత్వం మారడమే కాకుండా మార్పు రావాలని ఐదేళ్ల నియంతృత్వ పాలన పోవాలని ప్రజలు కోరుకున్నారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో జరిగిన దౌర్జన్యాలు, అకృత్యాల నుంచి విముక్తి కలగాలని ప్రజలు మార్పు తీసుకొచ్చారని యనమల చెప్పుకొచ్చారు. తన 41 ఏళ్ల రాజకీయ జీవితంలో గత ప్రభుత్వం అంత దారుణమైన ప్రభుత్వాన్ని ఇంతకుముందెన్నడు చూడలేదన్నారు. ఇన్నేళ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా ప్రవర్తించలేదన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రజల అవసరాలు తీర్చడానికే చట్టసభలు ఏర్పడ్డాయన్నారు.
ప్రజా సమస్యలపై డిబేట్ జరగాలి
శాసనసభలో గత ఐదేళ్లు దారుణమైన విధానాలు అవలంభించారని యనమల ఆరోపించారు. ప్రతిపక్షాన్ని అణచివేయాలన్న ఉద్దేశంతోనే మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వలేదన్నారు. ప్రతిపక్ష శాసన సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రతి రోజూ సస్పెండ్ చేసేవారంటూ మండిపడ్డారు. 151స్థానాలు వచ్చాయి కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు పాలిస్తా అన్నే విధానమే అప్పటి అధికార పార్టీ కొంపముంచిందన్నారు. ప్రజాస్వామ్యం అంటేనే చట్టసభల్లో ప్రజా సమస్యలపై డిబేట్ జరగాలని అర్థం. ప్రజా సమస్యలను వదిలేసి ఎక్కడికో పోతామనేది సరైన పద్ధతి కాదన్నారు. ప్రతిపక్షాన్ని అవమానపరిచారు కాబట్టే అంత దారుణంగా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని యనమల ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లు ప్రతిపక్షాలకు జగన్ అవకాశం ఇవ్వలేదన్నారు. కొన్ని మీడియాలను కూడా బ్యాన్ చేశారని... ఇది చాలా దారుణమన్నారు.
జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలి
ఏ ప్రభుత్వమైనా చట్టసభల్లో డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంభించాలని కోరారు. మా ప్రభుత్వం దానికి అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వ్యవస్థలను పునరుద్ధరించి గాడిలో పెట్టాలన్నారు. అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలా కాకుండా బాయ్ కాట్ చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. దోచుకునే నాయకత్వం పోయి, కమిటెడ్ నాయకత్వం వచ్చిందని వ్యాఖ్యానించారు. దివాలా తీసిన రాష్ట్రాన్ని సర్ ప్లెస్ రాష్ట్రంగా చెప్పుకునే అవకాశం వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా మోడీ, చంద్రబాబు, పవన్ నాయకత్వం పని చేస్తుందని చెప్పుకొచ్చారు.