Konaseema News: వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన జరిగింది. ఈ పునర్విభజనతో ఏర్పడ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పుడు మరిన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముందు నుంచి మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలో కొంత భాగాన్ని తూర్పుగోదావరి జిల్లాలోను, కాకినాడ జిల్లాలోనూ కలపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఏకంగా మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలను తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో కలిపాలన్న డిమాండ్ ఊపందుకుంది.. దీనికనుగుణంగా కూటమి ప్రభుత్వం సానుకూలంగా అడుగులు వేస్తోండగా మొత్తం మీద అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మార్పులు ఖాయమనే సంకేతాలు గట్టిగానే ఉన్నాయి.
ఎందుకీ పరిస్థితి...
మండటపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాలన్నీ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి అత్యంత దూరం. అయితే ఇక్కడ ప్రాంత ప్రజలు తమకు అత్యంత సమీపంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి కలపాలన్న డిమాండ్ మొదటి నుంచి వినిపిస్తున్నారు. ఈ తరహా డిమాండ్ ముఖ్యంగా మండపేట నియోజకవర్గంలోని కేశవరం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా వినిస్తోంది. ఆలమూరు మండల పరిధిలోకి వచ్చే బడుగువాని లంక ప్రాంతంలో కూడా ఈతరహా డిమాండ్ వినిపించింది.. ఇది కొత్తపేట నియోజకవర్గ పరిధిలోనిది గనుక ఆ అవకాశం లేదనే చెప్పాలి. అయితే ఇటు రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పలు ప్రాంతాలన్నీ కాకినాడకు అత్యంత సమీపం.. ఈ ప్రాంతాలనుంచి కాకినాడ వెళ్లాలంటే కేవలం 5 నుంచి 10 కిలోమీటర్లు దూరం మాత్రమే. అయితే వీరంతా కూడా కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం రావాలంటే గౌతమీ నదీపాయ దాటి రావాలి. లేదా పుదుచ్చేరి యానాం నుంచి అమలాపురం రావాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని పక్కజిల్లాలకు అత్యంత సమీపంలోని ప్రజలంతా ఈ డిమాండ్‌ను జిల్లాల పునర్విభజన నాటి నుంచి వినిపిస్తున్నారు.. ఇటువంటి ఇబ్బందుల ఉన్నందున ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే తాళ్ల రేవు మండలాన్ని కాకినాడ జిల్లాలోకి చేర్చారు. మూడు జిల్లాల్లో కేవలం ఈ ప్రాంతం మాత్రమే నియోజకవర్గంతో సంబంధం లేకుండా పక్క జిల్లాలోకి మార్చారు అధికారులు.
ప్రజాప్రతినిధులు సైతం మొగ్గు చూపుతున్నారా..
జిల్లాల పునర్విభజనలో కోనసీమ జిల్లాను అమలాపురం పార్లమెంటు పరిధినే జిల్లాగా నిర్ధారించిన పరిస్థితి ఉంది. అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఏడు నియోజకవర్గాలున్నాయి. అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, రామచంద్రపురం, మండపేట.. ప్రస్తుతం రామచంద్రపురం కాకినాడ జిల్లాలో కలిపేందుకు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పూర్తి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నవారికి తన సంఘీభావం కూడా తెలియజేశారంటున్నారు.. ఇదిలా ఉంటే మండపేట నియోజకవర్గాన్ని కూడా తూర్పుగోదావరి జిల్లాలోకి మార్చేందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.. ఈయన కూడా అక్కడి ప్రజలకు త్వరలోనే ఈసమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది...
కోనసీమ ఐదు నియోజకవర్గాలకే పరిమితం కానుందా..
కూటమి ప్రభుత్వం కొలువతీరాక జిల్లాల పునర్విభజనలోజరిగిన లోపాలన్నింటిని సవరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.. ఇందులోభాగంగా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ సంఘం ఇప్పటికే పలువురి నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనల్ని సేకరించింది. త్వరలోనే గత లోటుపాట్లను సవరించడంతోపాటు మరికొన్ని జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇదే జరిగితే కోనసీమ ప్రాంతం చిక్కిపోయే పరిస్థితి తప్పదు.. అంటే కోనసీమ జిల్లా ఇకపై అయిదు నియోజకవర్గాలకే పరిమితం కానుంది.. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో కలిసిపోయే పరిస్థితి కారణం నియోజకవర్గాల పునర్విభజన జరిగితేనే కానీ కొన్ని ప్రాంతాలు పక్క జిల్లాల్లోకి కలిపే అవకాశం లేదు. అందుకే కోనసీమ జిల్లాను అయిదు నియోజకవర్గాలకే పరిమితం చేసి పార్లమెంటు పరిధిని మాత్రం కదిపే అవకాశం లేనందున దాన్ని అలానే కొనసాగిస్తారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.