గేమ్‌ఛేంజర్ ఈవెంట్ రాజమండ్రికి ఎందుకు షిప్ట్ అయ్యిందో తెలుసా..
రాజమండ్రి: కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో గేమ్‌ఛేంజర్ మూవీ అప్డేట్ గురించి మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. గేమ్ చేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుందని అంతా ఊహించారు. అందరూ ఊహించినట్లుగానే గేమ్‌ఛేంజర్ ఈవెంట్ మూవీ టీమ్ అయితే ముందుగా కాకినాడ జిల్లాలోనే ఏర్పాటు చేయాలనుకుంది. దీనికోసం గత నెల రోజులుగా కూడా కాకినాడ - పిఠాపురం మధ్యలో మెయిన్ రోడ్డుకు ఆనుకుని భారీ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. కానీ ఆఖరి నిముషంలో మాత్రం అనూహ్యంగా గేమ్ చేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ రాజమండ్రికి షిఫ్ట్ అయ్యింది. ఇప్పటికే వేమగిరి ప్రాంతంలో నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న సుమారు 40 ఎకరాల ఖాళీ స్థలంలో ఈవెంట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
కాకినాడలో జరగాల్సిన ఈవెంట్ మార్పునకు కారణం ఏంటి..
రామ్ చరణ్ బాబాయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో ఉన్నప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇక్కడే నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మూవీ టీమ్ నెల రోజుల క్రితం కాకినాడ ` పిఠాపురం మధ్య ఎక్కడైనా భారీ ప్రాంగణం గురించి పరిశీలించారు. అన్ని అనుకూలతలు ఉండేలా ఆ స్థాయిలో ముఖ్యంగా 216 జాతీయ రహదారికి ఆనుకుని ఉండేలా ప్లాన్ చేశారు. అయితే ఈప్రాంతంలో ఆస్థాయి భారీ ప్రాంగణం దొరకకపోవడం రాజమండ్రికి ఈవెంట్ మారిందనే టాక్ వినిపిస్తోంది. పైగా ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా ఓ మహిళ మృతిచెందడం, అది పెద్ద వివాదంగా మారి.. నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌కు దారితీసింది. ఆ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న చిత్ర బృందం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే గోదావరి జిల్లాల్లో అనువైన ప్రాంతాన్ని వెతగ్గా రాజమండ్రికి సమీపంలోని వేమగిరిలో సుమారు 40 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఖరారుచేసి ఈవెంట్ అక్కడే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
గతంలో టీడీపీ మహానాడు
నేటి (శనివారం) సాయంత్రం జరగనున్న గేమ్ చేంజర్ ఈవెంట్ తూర్పు గోదావరి జిల్లా కడియం మండల పరిధిలోని వేమగిరిలోని నాలుగు లైన్ల జాతీయ రహదారికి ఆనుకున్న ఉన్న భారీ ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. డాక్టర్ వెలుగంటి వెంకటాచలానికి చెందిన ఈభారీ ఖాళీ స్థలంలో గతంలో టీడీపీ మహానాడు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆతరువాత ప్రధాని మోదీ బీజేపీ భారీ బహిరంగ సభ కూడా ఇక్కడే నిర్వహించారు. సుమారు లక్ష మందికి ఎంట్రీ పాస్‌లు మూవీ టీమ్ ఇవ్వనుండగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఎస్‌బీ ఏఎస్పీ మురళీకృష్ణలు సభా స్థలాన్ని పరిశీలించి ఈవెంట్ నిర్వాహకులతో మాట్లాడారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్లాన్‌ను సిద్ధంచేశారు.
ఈవెంట్‌కు హాజరు కానున్న మెగా ఫ్యామిలీ..
గేమ్‌చేంజర్ మెగా ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ మొత్తం తరలిరానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నాగబాబుతోపాటు మెగా ఫ్యామిలీ అంతా తరలిరానుంది. దాంతో భారీగా జనసందోహం తరలివచ్చే అవకాశాలున్నందున అత్యంత భారీ భద్రత నడుమ ప్లాన్ ప్రకారం ఈవెంట్ నిర్వహించేందుకు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.