Tuni Arson Case : తుని రైలు దగ్ధం కేసును అప్పీలుకు వెళ్లాలని ఏపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది.. అసలు ప్రభుత్వానికి అప్పీలుకు వెళ్లాలన్న ఆలోచనే లేదని ఆర్పీఎఫ్ ప్రతిపాదన ఆధారంగా ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పుకొచ్చింది. దీని వల్ల కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమువుతుందని పసిగట్టే యుద్ధప్రాతిపదికన ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆనాడు తుని రైలు ఘటనలో నిందితులుగా ఉన్నవారు తమ ఊళ్లల్లో సంబరాలు చేసుకున్నారు...
నిందితుల్లో చాలా మంది ఇప్పుడు కూటమిలో...
కాపు రిజర్వేషన్లు కోరుతూ కాపు ఉద్యమ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తునిలో 2016 జనవరి 30న నిర్వహించిన భారీ కాపు నాడు సభ అనంతరం అల్లర్లు చెలరేగాయి. తుని రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో ఆగి ఉన్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పుపెట్టారు. అంతే కాకుండా రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారు. తునిలో పోలీస్ స్టేషన్లు తగులబెట్టారు. ఇలా ఆ రోజు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించారు. అయితే ఈ నేపథ్యంలోనే దర్యాప్తు ప్రారంభించిన రైల్వే పోలీసులు, ఇటు ఏపీ పోలీసులు ముద్రగడ పద్మనాభం, కామన ప్రభాకరరావు, సాయిన సుధాకర్ నాయుడు, ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, నల్లా విష్ణుమూర్తి సహా మొత్తం 41 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేసులను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయగా, 2023 మే 1న విజయవాడ రైల్వే కోర్టు తుది తీర్పుగా కేసును కొట్టివేసింది. అయితే ఇప్పుడు వైసీపీలో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి మాత్రం మిగిలిపోగా మిగిలినవారంతా దాదాపు 38 మంది వరకు టీడీపీ, జనసేన పార్టీల్లో ఉన్నారు.. ఆ ఆ పార్టీల్లో ఆయా కీలక పదవుల్లో ఉన్నారు కూడా...
2024 ఎన్నికల్లో కూటమి తరపునే..
2024 మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసిన క్రమంలో ఏపీలో కీలక సామాజికవర్గం అయిన కాపులు కూటమి వెంటే ఉన్నారు. తుని రైలు దగ్ధం కేసులో ఉన్న ప్రధాన నిందితుల్లో చాలా మంది జనసేనలో ఉండగా మరికొందరు టీడీపీలో ఉన్నారు. అయితే జూన్ 3న ఈ కేసును రీ ఓపెన్ చేసి హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ కూడా చేసింది.. దీంతో ఒక్కసారిగా ఈ కేసు గురించి కూటమిలో ప్రకంపనలు చెలరేగాయి..
అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం..
రైల్వే పోలీసులు పంపించిన ప్రతిపాదనల ఆధారంగానే హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని జీవో జారీ అయ్యిందని, అయితే ఈ కేసును తిరగతోడాలన్న ఆలోచన లేదని ఆ జీవోను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. దీంతో ఆ నాడు ఈ కేసులో ఉన్న నిందితులంతా ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌తోపాటు పలువురు టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా షూటింగ్‌లో బిజిగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి పలువురు జనసేన నాయకులు తీసుకెళ్లారు. దీంతో జారీ చేసిన జీవోను వెనక్కు తీసుకుంటున్నల్లు అధికారులు వెల్లడిరచారు. మొత్తం మీద ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీకి చెందిన వారి గురించే ప్రభుత్వం కేసును అప్పీలు చేయాలని నిర్ణయం తీసుకుందని, కానీ ఎక్కువ మంది నిందితులు ప్రస్తుతం టీడీపీ, జనసేనలో కీలక పదవుల్లో కొనసాగతున్నవారు ఉన్నారని తెలియడంతోనే యుద్ధప్రాతిపదికన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.