Godavari Floods: వస్తున్నారు.. పోతున్నారు.. కష్టం తీర్చేదెవరు అని ప్రశ్నిస్తున్నారు ముంపు ప్రాంతాల ప్రజలు. గోదావరి వరద బీభత్సంతో లంక గ్రామాలు, పోలవరం పరిసర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కొన్నిరోజులుగా ప్రజలు ఆ వరదనీటిలోనే జీవనం సాగిస్తున్నారు. ఓవైపు పునరావసం కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా, ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించినా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇదే అవకాశంగా చేసుకుని, అధికార పార్టీ నేతలు ముంపు ప్రాంతాల్లో పర్యటించినా ప్రయోజనం లేకుండా పోతోంది. అధికారంలో ఉన్నవాళ్లు హామీల వర్షం కురిపిస్తారు కానీ, అవి అమలు కావడానికి కొన్నేళ్లు పడుతుందని, కొన్ని నెరవేరవు అని ముంపు ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు.


సీఎం జగన్ వరాల జల్లు ‍- ఏ మేరకు ఉపయోగం? 
వర్షాల తర్వాత  ఏరియల్‌ వ్యూ (Aerial View)తో ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఏపీ సీఎం జగన్.. ఆ తర్వాత స్వయంగా రంగంలోకి దిగి హామీల వర్షం కురిపించారు. మూడేళ్ల తర్వాత మళ్లీ అక్కడి ప్రజలను కలుసుకున్నారు. ముంపు ప్రాంతాల ప్రజల దగ్గరకు వెళ్లి తనదైన శైలిలో వారిని పలకరించడంతో పాటు తానున్నానని భరోసా ఇచ్చారు. అన్నీ మీ చెంతకు వచ్చేలా చేస్తా, మీకు ఇబ్బంది లేకుండా చూస్తానని, మళ్లీ మీ జీవితాలను మార్చేస్తానని హామీ ఇచ్చారు. ఈ జగనన్న ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాడని వారికి ధైర్యం చెప్పి వచ్చారు.


చంద్రన్న అభయహస్తం పనికొస్తుందా? 
సీఎం జగన్ వచ్చి వెళ్లగానే ఇలా మాజీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇంతకుముందు ఇలానే కోనసీమ జిల్లాలోని పలు వరదప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు భద్రాదిలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో తిరిగారు. బాధితుల కష్టనష్టాలను విన్న ఆయన ఎప్పటిలాగానే సీఎం పనితీరుపై విమర్శలు చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే పోలవరం సమస్య తీరుతుందని సైతం ప్రతిపక్షనేత సలహా ఇచ్చారు. అంతేకాదు తన హయాంలోనే అంతా అభివృద్ధి జరిగిందని ఇప్పుడు ఈ సమస్య నుంచి గట్టేక్కించాలంటే మళ్లీ వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.


కాషాయం రూటే వేరు.. 
ఇక ఈ అధికార విపక్షాలకు భిన్నంగా బీజేపీ పాదయాత్ర చేపట్టింది. వరదలు సంభవించిన ప్రజల దగ్గరకి వెళ్తే బురదే అంటుకుంటుందనుకున్నారేమో.. మన అమరావతి పేరుతో  రాజధాని ప్రాంతాల్లో బీజేపీ నేతలు సంకల్పయాత్ర మొదలెట్టారు. ఆగస్ట్ 4తో ఈ పాదయాత్ర ముగుస్తుంది. ప్రత్యేకహోదాపై మాట్లాడని రాష్ట్ర బీజేపీ నేతలు రాజధాని విషయంలో వైసీపీని ప్రజలముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడక్కడ అది మిస్ ఫైర్ అవుతోంది. మొన్నొక పెద్దాయన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుని మొహం మీదనే ఎన్నో విషయాలు అడిగి కడిగేశాడు. అంతేకాదు విశాఖ ఉక్కు విషయంలోనూ తెలుగు ప్రజలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ విషయాలపై ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని కాషాయం శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి. 


అంతంతమాత్రంగా జనసేనాని.. 
ఇలా అధికార, విపక్షాలు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా రంగంలోకి దిగకపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జనసేన నేతలు ఒకరిద్దరు ముంపు ప్రాంతాల్లో పర్యటించి అధినేతకి వివరాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పవన్‌ కల్యాణ్‌ దసరా తర్వాత పూర్తిగా ప్రజల్లోనే ఉంటారని అందువల్లే ఇప్పుడు జనసేన నేతలను రంగంలోకి దింపారని సైతం వినిపిస్తోంది. సినిమాల్లో పవర్‌ స్టార్ అయిన పవన్ సైతం ఈ సమయంలో వచ్చి ఉంటే రాజకీయాలు చేస్తున్నారన్న టాక్ వస్తోందని, ఆయన రాకుండా జనసైనికులను పంపారని ప్రచారంలో ఉంది. ఏది ఎలా ఉన్నా  వరదలొచ్చినప్పుడల్లా ఇలా బాధితులను  పరామర్శించడం తప్ప.. శాశ్వత పరిష్కార మార్గాలు చూపిస్తే బాగుంటుందని ముంపు ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. అధికారంలో ఉన్నవాళ్లు అది చేస్తాం, ఇది చేస్తామని హామీలు ఇస్తున్నారు. తాము అధికారంలో ఉంటే ఇలాంటివి జరగకుండా చూసేవాళ్లమని, అందరికీ సత్వరమే సాయం అందజేసే వాళ్లమని చెబుతున్నారు.