Vande Bharat Train Halt In Eluru : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు వస్తున్న వందే భారత్ రైలు సేవలు ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు వందే భారత్ రైలు హాల్ట్ ఏలూరులో లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు హాల్టు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హాల్ట్ మంజూరు చేయడంతో ఆదివారం సాయంత్రం వందే భారత్ రైలుకు జండా ఊపి గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, జనసేన, బిజెపి నాయకులు ఏలూరు రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలుకు ఘనంగా స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా జెండా ఊపి సేవలను ప్రారంభించిన మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. వందే భారత్ రైలుకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఏలూరు జిల్లా వ్యవసాయ, పారిశ్రామికంగా, ఆక్వా పరంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని,  వ్యాపారులు, ప్రజలు వైజాగ్, హైదరాబాద్ ప్రాంతాలకు తక్కువ సమయంలో వెళ్లేందుకు వందే భారత్ రైలు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. వందే భారత్ రైలుకు ఏలూరులో హాల్ట్ కోసం కృషి చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ రైలు హాల్టు సేవలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. 


ప్రజల నుంచి వచ్చిన వినతులతోనే కేంద్రం దృష్టికి..


ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిమిత్తం ఏలూరు నియోజకవర్గం పరిధిలోని అనేక చోట్లకు వెళ్ళినప్పుడు ప్రజలు వందే భారత రైలు హాల్ట్ కోసం పెద్ద ఎత్తున వినతులు వచ్చాయన్నారు.  ఇటు హైదరాబాద్, అటు విశాఖ వెళ్లేందుకు ప్రజలకు ఈ రైలు హాల్టు సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్న ఉద్దేశంతోనే కేంద్రం దృష్టికి ప్రజల డిమాండ్ ను తీసుకు వెళ్లినట్లు ఎంపీ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ప్రజల కోరికను తెలియజేసినట్లు ఎంపీ వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం హాల్టును మంజూరు చేయడం పట్ల ఆనందాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఎంపీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. 


కార్యక్రమంలో అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ పిఈ ఎడ్విన్, సీనియర్ డీఈఈ టి సురేష్, సీనియర్ డివోఎం సత్యస్వరూప్, సీనియర్ డిఎస్టిఈ ఎండి అలీ ఖాన్, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళి రామకృష్ణ, గన్ని వీరాంజనేయులు, ఏలూరు నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎన్ఆర్ పెదబాబు, బలరాం తదితరులు పాల్గొన్నారు.