వందేభారత్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ట్రెండింగ్. ఇప్పటికి దేశ వ్యాప్తంగా సుమారు పది రూట్‌లలో వందేభారత్ నడుపుతోంది రైల్వే శాఖ. ఇంత వరకు ఎక్కడా రాని సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఓ వ్యక్తికి వచ్చింది. ఇప్పుడదే వైరల్‌గా మారింది.
వందేభారత్ ట్రైన్‌లో ఎక్కాలని కొందరు ఉత్సాహం చూపిస్తుంటే మరికొందరు ఆ ట్రైన్‌లో ఫొటోలు దిగి సంబర పడిపోతున్నారు. ఓ రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి ఇలానే ట్రైన్‌లో సెల్ఫీ దిగుదామని ఉత్సాహం చూపాడు. ఆ ఉత్సాహం ఆయన జేబుకు చిల్లు పెట్టింది.
రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి తన బంధువులను స్టేషన్‌లో డ్రాప్ చేయడానికి వచ్చాడు. అప్పుడే వచ్చి ఆగింది వందే భారత్ ట్రైన్. చూసిన వెంటనే సంబరపడిపోయాడు. ఓ సెల్ఫీ దిగి.. స్టేటస్ పెట్టుకుందామని అందులోకి దూరాడు. సెల్ఫీలు తీసుకుంటుండగానే ట్రైన్ కదలడం స్టార్ట్ అయింది.
నార్మల్ ట్రైన్స్ మాదిరిగానే కదులుతున్న ట్రైన్ నుంచి దిగిపోవచ్చని అనుకున్నాడేమో.. పరుగెత్తుకొని డోర్ దగ్గరకు వచ్చాడు. కానీ అప్పటికే డోర్స్ క్లోజ్ అయిపోయాయి. దీంతో వాటిని తెరిచేందుకు కూడా ట్రై చేశాడు. అక్కడే ఉన్న ట్రైన్ సిబ్బంది ఆ వ్యక్తిని ఆపారు. ఏం కావాలని అడిగారు.
తాను ఈ ట్రైన్‌లో ప్రయాణించడానికి రాలేదని... సెల్ఫీ కోసం వచ్చి ఇరుక్కుపోయానని చెప్పాడు. దీంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఇది అన్ని ట్రైన్స్ మాదిరిగా కాదని... స్టేషన్‌లో ట్రైన్ స్టార్ట్ అవ్వక ముందే డోర్స్ క్లోజ్ అయిపోతాయని... దిగడానికి వీలు ఉండదని చెప్పేశారు.
రాజమండ్రలో బయల్దేరిన ట్రైన్ ఇక మధ్య ఎక్కడా ఆగబోదన్న ట్రైన్ సిబ్బంది సమాధానం ఆ వ్యక్తిని మరింత కంగారు పెట్టింది. ఓ ఫొటో కోసం ఆశపడి ఇప్పుడు రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్లాలా అని బిత్తరపోయాడు. ఏలాగైనా ట్రైన్ ఆపించాలని ప్రాధేయపడ్డాడు. కానీ సిబ్బంది మాత్రం అలా కుదరదని చెప్పేశారు.