Rajuhmundry News: ప్రజా ప్రతినిధులు భరోసా ఇచ్చారు... ఇక మాకేంటి.. మమ్మల్నెవరు ఏం చేస్తారు? అనుకుంటున్న కోడిపందేల నిర్వాహకులపై ఈసారైనా కేసులు నమోదవుతాయా లేక ఎప్పటిలానే పందేల వద్ద కూలీనాలి కోసం పాకులాడే పనోళ్ల మీదే జులుం ప్రదర్శిస్తారా అనేది ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చజరుగుతోంది. ఎందుకంటే ఇంత వరకు ఇదే జరిగిందని పలువురు చెబుతున్నారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు విచ్చలవిడిగా దగ్గరుండి ఆడించిన పందేలలో చాలా మంది నాయకులే ఉన్నారు. వీరికి రాజకీయ పలుకుబడి ఉండడంతో వీరిపై ఎటువంటి కేసులు నమోదు కావట్లేదన్నది ప్రజాసంఘాల మాట. బరుల్లో బరి తెగించి ఆడించిన వారు వీడియోల్లోనూ, ఫొటోల్లోనూ కనిపిస్తున్నా వీరిపై ఎటువంటి కేసులు నమోదు కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


కోడిపందేల నిర్వాహణ లాభసాటిగా మారడం ప్రతీ ఏటా ఇదే పనిగా పెట్టుకుని పందేలు నిర్వహిస్తున్నారని, వీరు ఎప్పటిలానే తప్పించుకుంటున్నారని అంటున్నారు.  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి ఈసారి జూదాలపై ఉక్కుపాదం మోపారు. కోడిపందేల విషయంలోనూ చాలా వరకు నియంత్రించగలిగారు. తాజాగా కోడి పందేల విషయంలో నమోదవుతోన్న కేసుల విషయంలో పారదర్శకంగా విచారణ జరిపి అసలు నిర్వాహకులపై కేసులు నమోదు చేయించాలని పలువురు కోరుతున్నారు. అప్పుడే చట్టవిరుద్ధ కార్యకలాపాలు తగ్గుతాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో ఎక్కడెక్కడ, ఏయే  గ్రామాల్లో పందేలు నిర్వహించారు, బరులు వేసిన స్థలాలు ఎవరివి, అసలు ఈ పందేల నిర్వాహకులు ఎవరు అన్నదానిపై జిల్లా పోలీస్‌ బాస్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


అసలు నిర్వాహకులు ఎంత మంది..?


అల్లవరం మండల పరిధిలో పది మందిపై కేసులు నమోదయ్యాయి. రూ.2770 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ తాజాగా నమోదైన కేసుల్లో అసలు పందేల నిర్వాహకులు ఎంతమంది ఉన్నారన్నది ప్రశ్నార్ధకంగా కనిపిస్తోంది. అసలు నిర్వాహకులు బహిరంగంగానే పందేలు దగ్గరుండి ఆడించారని, దగ్గరుండి బరులు సిద్ధం చేశారని చెబుతున్నారు. నమోదైన కేసుల్లో అసలు నిర్వాహకులు ఉంటే సరి.. లేకపోతే అసలు దోషులను గుర్తించి కేసులు నమోదు చేయాలన్నది ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తల మాట. కేసుల నమోదు వ్యవహారలో 80 శాతం మంది అసలు దోషులు తప్పించుకుంటున్నారని, కేవలం నాలుగు డబ్బులు కోసం ఆశపడి అక్కడ పనిచేసిన వారే అధికంగా బలవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.


గతం నుంచి అదే పరిస్థితి...


కోడిపందేల వ్యవహారంలో ఇంతవరకు అసలు పందెం నిర్వాహకులు ఈ తరహా కేసులకు చిక్కకుండా కేవలం పందేల్లో పొట్ట కూటి కోసమే కత్తులు కట్టేవారే నిందితులుగా మారేవారు అంటున్నారు. మండల స్థాయిలో మండల మెజిస్ట్రేట్‌ వద్ద బైండోవర్లు వేసే కేసుల్లో కూడా ఈ తరహా పేదలే బాధ్యులు అవుతున్నవారు ఎక్కువ. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈసారి అయినా మార్పు కలుగుతుందా అని చాలా మంది ఆసక్తితో గమనిస్తున్నారు. పోలీసులు తాజాగా నమోదు చేసిన కేసుల్లో పందేల అసలు నిర్వాహకులు చాలా వరకు లేరని.. అసలు నిర్వాహకులను గుర్తించి కేసులు నమోదు చేయాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది.