RGV Tweet: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మెగా బ్రదర్ నాగబాబుపై తనదైన స్టైల్ లో విమర్శలు చేస్తూ.. ట్వీట్ చేశారు. హలో పవన్ కల్యాణ్ గారూ.. కొంచెం మీ బాయిజాన్ గారిని చూస్కోండి అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. ఆయన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ కు నాగబాబు ప్రియమైన వ్యక్తి కావొచ్చేమో కానీ తనకు కాదంటూ వీడియోలో తెలిపారు. తాను జనసేన పార్టీ మీద కానీ పవన్ కల్యాణ్ మీద కానీ పెట్టిన ట్వీట్లు ఓ అభిమానిగా చేసినవే అని చెప్పుకొచ్చారు. అయితే అవి వారికి అర్థం కాకపోవడం తన దురదృష్టం అని, తనకంటే ఎక్కువ పవన్ కల్యాణ్ దురదృష్టకరమని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. నాగబాబు లాంటి సలహాదారులను మాత్రమే పెట్టుకుంటే దాని ఫలితాన్ని ప్రజలే చెబుతారని వెల్లడించారు. 






గత కొంతకాలంగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవణ్ కల్యాణ్ లపై తనదైన శైలిలో రాంగోపాల్ వర్మ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా యువశక్తి సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై కూడా కామెంట్లు చేశారు. "డబ్బు కోసం కాపులను కమ్మ వాళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు, కంగ్రాట్స్ కమ్మ వాళ్ళు" అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లోనే కాక అటు కాపు, కమ్మ కులాల్లోనూ దుమారానికి కారణం అయ్యాయి. నిత్యం సంచలనాలు రేకెత్తించే కామెంట్స్ చేసే వర్మ ఈ సారి రాజకీయంగా, కులాలను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ పై తీవ్ర చర్చ జరుగుతోంది.


వీడియోలో రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడారంటే..?


"కొణిదెల నాగబాబు గారు ఆయన తమ్ముడికి, అన్నయ్యకి ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. కానీ నాకు మాత్రం కాదు. పాయింట్ వన్. పాయింట్ టూ ఏంటంటే.. నేను జనసేన మీద కానీ పవన్ కల్యాణ్ మీద గానీ చేసిన టీట్లు పవన్ కల్యాణ్ అభిమానిగా చేశాను. అది అర్థం అవ్వకపోవడం నా దురదృష్టం. నాకన్నా ఎక్కువగా పవన్ కల్యాణ్ దురదృష్టం. ఎందుకంటే కేవలం తన అన్నయ్య కాబట్టి ఇలాంటి సలహాదారులను పెట్టుకుంటే.. దాని తర్వాత పవన్ కల్యామ్ ఔట్ కం ఏంటో జనాలే చెబుతారు." - పవన్ కల్యాణ్


అయితే సంక్రాంతి సందర్భంగా రాం గోపాల్ వర్మ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఆదివారం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కలుసుకొని రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల్లో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని తెలిపారు. వారంతా పిలిస్తేనే తాను అక్కడకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగానే నాగబాబు వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. తన గురించి నాగబాబు ఏం మాట్లాడారో తెలియని అన్నారు. దాని గురించి తాను వినలేదని వెల్లడించారు. వాటిని విన్న తర్వాత స్పందిస్తానని చెప్పారు. ఆ తర్వాతే ఆయన ట్టిట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. హలో పవన్ కల్యాణ్ గారు.. కొంచెం మీ బాయిజాన్ గారిని చూస్కోండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.