YSRCP MP Chinta Anuradha: ఆంధ్రప్రదేశ్ లో 28 రూట్లలో ఉడాన్ పథకం అమలవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తెలిపారు. ఉడాన్ 4.2 లో భాగంగా దేశవ్యాప్తంగా విమానయాన సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి సింథియా వెల్లడించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు, అమలాపురం ఎంపీ చింతా అనురాధ ఆంధ్రప్రదేశ్ లో ఉడాన్ పథకం విస్తరణపై ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి సమాధానమిస్తూ... ఏపీలో ఇదివరకే ఇరవై ఎనిమిది రూట్లలో ఉడాన్ పథకం అమలవుతుందన్నారు.
ఉడాన్ 4.2 లో భాగంగా దేశంలో పలు చిన్న నగరాలకు విమాన సేవలు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 132 రూట్లలో ఉడాన్ పథకం సమర్ధవంతంగా అమలు చేయబడుతుందన్నారు. ప్రజాస్వామ్య విధానంలో దేశం నలుమూలల విమానయాన సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి సింథియా వివరించారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక ప్రాంతీయ అనుసంధాన పథకం - ఉడాన్ ( ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) కింద 2017 ఏప్రిల్ 27 న ప్రధాన మంత్రి మొదటి విమానాన్ని ప్రారంభించారు. విజయవంతంగా ఐదు సంవత్సరాల నుంచి పథకం కొనసాగుతోంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి అయిదేళ్లలో విమానాలలో కోటి మందికి పైగా ప్రయాణించారు. 2026 నాటికి ఈ పథకం కింద 1000 మార్గాలు, 220 విమానాశ్రయాలను అనుసంధానించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
గడచిన ఐదు సంవత్సరాలలో, ఉడాన్ దేశంలో ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీని గణనీయంగా పెంచింది. 2014 లో ఈ పథకం కింద 74 ఆపరేషనల్ విమానాశ్రయాలు ఉండగా ఈ సంఖ్య ఇప్పుడు 141 కు పెరిగింది. 'ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ' దార్శనికతను అనుసరించడం ద్వారా ద్వితీయ , తృతీయ శ్రేణి నగరాల్లో విమానయాన మౌలిక సదుపాయాలు, వైమానిక అనుసంధానాన్ని పెంపొందించడం ద్వారా సామాన్య పౌరుల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఈ పథకాన్ని 2016 అక్టోబర్ 21న ప్రారంభించారు. ఓవరాల్‌గా ఉడాన్ కింద, 156 విమానాశ్రయాలను అనుసంధానించడానికి ఇప్పటికే 954 మార్గాలు మంజూరు చేసినట్లు కేంద్రం కొన్ని రోజుల కిందట వెల్లడించింది.
ఉడాన్ చాలా ముఖ్యమైన పథకమని, వైసీపీ ఎంపీ అనురాధ కీలక విషయాన్ని ప్రస్తావించారన్నారు. టైర్ 1 నగరాల నుంచి టైర్ 2 నగరాలకు విమనా సర్వీసులు కల్పిస్తుంది ఉడాన్ పథకం అన్నారు. స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ ల ద్వారా చిన్న చిన్న నగరాలకు విమాన సర్వీసులు అందిస్తున్నామని చెప్పారు. 23 సీట్ల సామర్థ్యం కలిగిన జెట్, హెలికాప్టర్ లాంటి చిన్న ఎయిర్ క్రాఫ్ట్ లతో సర్వీసులు మొదలుపెట్టామన్నారు. 132 మార్గాల్లో 16 హెలికాప్టర్లు, 50 వైమానిక సర్వీసులు ప్రారంభించామని లోక్‌సభలో వెల్లడించారు.