మాజీ డ్రైవర్ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌పై విడుదలయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బుధవారం సాయంత్రం దాటాక అనంతబాబు జైలు నుంచి విడుదల అయ్యారు. ఎమ్మెల్సీకి బెయిల్‌పై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు కొన్ని షరతులు విధించింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులతో మాట్లాడటంగానీ, బెదిరించడం చేయకూడదని ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రూ.50 వేలు వ్యక్తిగత పూచీకత్తుతో ఇద్దరు జామీనుదారులు ఉండాలని కోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు విదేశాలకు వెళ్లకూడదని కోర్టు షరతులు విధించింది. పాస్‌పోర్టును సైతం సరెండర్ చేయాలని కోర్టు షరతులు విధించింది.
ఇదివరకే డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యస్థ బెయిల్ ఆర్డర్లో ఈ కేసు విచారణ చేసే న్యాయస్థానం బెయిల్ కు సంబంధించి కొన్ని కండీషన్లు విధించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మంగళవారం సంబంధిత కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటం వలన ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి వాదనలు విని ఆదేశాల కొరకు బుధవారానికి వాయిదా వేశారు. న్యాయమూర్తి విధించే షరతులు ఆధారంగా బుధవారం నాడు అనంతబాబు జైలు నుంచి విడుదలయ్యారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద అరుచరుల అత్యుత్సాం
అప్పటికే జైలు ముందు పూలమాలలు, ఫ్లవర్ బోకేలతో హడావిడిగా బయట వేచిచూస్తున్న అనంతబాబు అనుచరులు చాలా మంది ఉండగానే వారికి కనిపించకుండా కారులో నేరుగా బయటకు వెళ్లిపోయారు. అనంతబాబు అక్కడి నుంచి నేరుగా బాబా గుడికి వెళ్లి అక్కడ దన్నం పెటుకున్నారు. ఆలయం నుంచి నేరుగా ఆయన నివాసంకు వెళ్లిపోతారనుకుంటున్న సమయంలో మళ్లీ బాబా గుడి వద్దనుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి అనంతబాబుకు ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. జై బాబు జైజై బాబు అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అనంతబాబు మెడలో దండలు వేసేందుకు అనుచరులు, కార్యకర్తలు పోటీపడ్డారు. కొందరు అభిమానులు అనంతబాబు వాహనంపై పూల వర్షం కురిపించి, గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం అనంతబాబు అక్కడి నుంచి ర్యాలీగా తరలి వెళ్లారు. అయితే ఈ విషయం రాజమండ్రితో పాటు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.