Kakinada: ఇంట్లో మగ దిక్కు లేకపోయినా కొడుకులా కష్టపడేది. బాగా చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తనతోపాటు ఉన్న అమ్మకు, నానమ్మను బాగా చూసుకోవాలనుకుంది. అందుకే ఇంజనీరింగ్ పూర్తైన వెంటనే ట్రైనీ ఇంజనీర్‌గా ఉద్యోగాన్ని వెతుక్కుంది. తన కాళ్లపై తాను నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతోంది. ఇంతలోనే విధి వంచించింది.. కానరాని లోకాలకు వెళ్లిపోయింది. కాకినాడలోని సౌజన్య నగర్‌లోని హారిక బంధువులను ఎవరిని కదిపినా ఆవేదనతో కూడిన ఇవే మాటలు వినిపిస్తున్న పరిస్థితి.
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృతి చెందారు అందులో చాలా మంది యువకులే ఉన్నారు. వారిలో కాకినాడకు రెండో డివిజన్ సౌజన్యనగర్‌కు చెందిన చర్లపల్లి హారిక దుర్మరణం పాలయ్యింది.. బుధవారం ఆమె మృతితో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం హారిక మృతదేహం స్వస్థలానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో హారిక కుటుంబం, బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇంజనీరింగ్ పూర్తిచేసి ఫార్మాలో చేరి
ఫార్మా కంపెనీలో జరిగిన పెను ప్రమాదంలో దుర్మరణం పాలయిన చర్లపల్లి హారిక చాలా మెరిట్ స్టూడెంట్. తండ్రి తాపీ మేస్త్రిగా పని చేస్తూ కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. సోదరుడు పదేళ్ల వయస్సులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఇంట్లో తల్లి అన్నపూర్ణ, నానమ్మ ఆదిలక్ష్మితో కలిసి ఉంటుంది హారిక. పదో తరగతి వరకు కాకినాడ రమణయ్యపేట మున్సిపల్ హైస్కూల్‌లో చదువుకున్న హారికకు పదోతరగతిలో మంచి మార్కులు రావడంతో ఇడుపులపాయలోని ట్రిబుల్ ఐటీకు ఎంపికైంది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన హారిక కెమికల్ ఇంజనీర్‌గా ఫార్మా కంపెనీలో ఎంపికవ్వడంతో గత ఏడాది సెప్టెంబరు నుంచి ట్రైనీ ఇంజనీర్‌గా అచ్యుతాపురం ఎసెన్షియా కంపెనీలో పనిచేస్తోంది.
పరీక్షల కోసం ఇంటికి వచ్చి వెళ్లి..
రెండు రోజుల క్రితం పరీక్షలు రాసేందుకు కాకినాడకు వచ్చింది హారిక.. డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు బుధవారం ఉదయం అచ్యుతాపురం వెళ్లింది. బుధవారం డ్యూటీలో జాయిన్ అయిన హారిక విధుల్లో ఉండగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తమ కుమార్తె మృతి చెందిందన్న సమాచారం తెలుసుకున్న తల్లి అన్నపూర్ణ, నానమ్మ ఆదిలక్ష్మి షాక్‌కి గురయ్యారు. రెండు రోజులపాటు సెలవు పెట్టి ఇంటికి వచ్చి తల్లి, నానమ్మలతో గడిపిన హారిక ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయిందన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో రోజు ఇంటి వద్దే ఉంటే తమ బిడ్డ బతికేదని రోదిస్తున్నారు.
హారిక అంత్యక్రియలు..
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలైన హారిక అంత్యక్రియలు గురువారం కాకినాడలో నిర్వహించారు బంధువులు. కాలిపోయిన దేహంతో నిర్జీవంగా ఉన్న కుమార్తె హారిక మృతదేహాన్ని చూసి తల్లి అన్నపూర్ణ, నానమ్మ ఆదిలక్ష్మి, బంధువర్గం కన్నీరుమున్నీరయ్యారు. ఆ ప్రాంతం అంతా రోదనలతో మిన్నంటింది. వారిని ఓదార్చడం ఎవరివంతు కాని పరిస్థితి కనిపించింది..
Also Read: అచ్యుతాపురం రియాక్టర్ బ్లాస్ట్: కంపెనీ ఓనర్స్ మధ్య గొడవలు - పవన్ కీలక వ్యాఖ్యలు
Also Read: ఆ కంపెనీలను వదిలిపెట్టబోం - ఫ్యాక్టరీల్లో సేఫ్టీ కోసం చంద్రబాబు కీలక నిర్ణయం