Atchutapuram Pharma Company News: అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీ యాజమాన్యం మధ్య విభేదాలు ఉన్నట్లు తమకు తెలిసిందని అన్నారు. తమకు అందిన సమాచారం మేరకే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. సేఫ్టీ ఆడిట్ చేయమని తాను ముందు నుంచి చెబుతున్నానని, అయితే కంపెనీలు వెనక్కు వెళతాయయోనని ఆందోళన చెందుతున్నారని అధికారులు చెప్పినట్లుగా వెల్లడించారు.
భద్రతా ప్రమాణాలు ముఖ్యం..
కంపెనీ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అర్థమవుతుందని పవన్ అన్నారు. రాష్ట్రంలో పరిశ్రలు అన్నింటినీ తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని.. ఇందుకు కంపెనీల యాజమాన్యం కూడా సహకరించాలని అన్నారు. భద్రతా ప్రమాణాలను ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. కాలుష్య నివారణ తనిఖీలకు కంపెనీలు ముందుకు రావాలని అన్నారు. ఈ నెలాఖరులో విశాఖపట్నానికి వెళతానని, కాలుష్య నివారణ, సేఫ్టీ ఆడిట్ పై ఫోకస్ చేస్తా అని పవన్ కల్యాణ్ తెలిపారు. 3 నెలల్లో ఈ భద్రతా ప్రమాణాలపై కార్యాచరణను ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.